KKY జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి..!

KKY జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి – నితిన్ గడ్కరీని కోరిన ఎమ్మెల్యే మదన్ మోహన్

కరీంనగర్–సిరిసిల్ల–వేములవాడ–కామారెడ్డి–ఎల్లారెడ్డి–పిట్లం 165 కి.మీ. రహదారికి తక్షణ ఆమోదం, నిధుల మంజూరుకు వినతి

న్యూఢిల్లీ | ఆగస్టు 4 | తెలంగాణ పవార్ దినపత్రిక
కరీంనగర్–సిరిసిల్ల–వేములవాడ–కామారెడ్డి–ఎల్లారెడ్డి–పిట్లం (KKY) వరకు ఉన్న సుమారు 165 కిలోమీటర్ల రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించి, పరిపాలనా మరియు ఆర్థిక అనుమతులు తక్షణమే మంజూరు చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేశారు.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలిసి ఎమ్మెల్యే మదన్ మోహన్ వినతిపత్రం సమర్పించారు. KKY జాతీయ రహదారి అమలుతో తెలంగాణ ఉత్తర, పశ్చిమ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు మహారాష్ట్రతో అనుసంధానం మరింత బలోపేతం అవుతుందని ఆయన వివరించారు.

పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనకు తక్షణ ఆమోదం తెలిపి, పెండింగ్‌లో ఉన్న పరిపాలనా ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక, పరిపాలనా పరిశీలనలు పూర్తయ్యాయని, తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసినట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ తుది ఆమోదం కోసం ఎదురుచూస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతిపాదిత KKY జాతీయ రహదారి ఎన్‌హెచ్–563 (కరీంనగర్), ఎన్‌హెచ్–44 (కామారెడ్డి), ఎన్‌హెచ్–765D (ఎల్లారెడ్డి), ఎన్‌హెచ్–161 (పిట్లం)లను అనుసంధానించే కీలక కారిడార్‌గా మారనుందని పేర్కొన్నారు.

ఈ జాతీయ రహదారి నిర్మాణంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా సరుకు రవాణా, వ్యవసాయం, వాణిజ్యం, పారిశ్రామిక అభివృద్ధి, పర్యాటక రంగాలకు విశేష ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. ముఖ్యంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతమైన రవాణా అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.

ఇప్పటికే కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నుంచి ఈ ప్రతిపాదనకు సూత్రప్రాయ ఆమోదం లభించిందని, అనంతరం అవసరమైన సాంకేతిక నివేదికలు, గ్రీన్‌ఫీల్డ్ అలైన్‌మెంట్ తదితర వివరాలను సమర్పించినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు. అలాగే రాష్ట్ర రోడ్లు–భవనాల శాఖ 2024లో కూడా ఈ రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన విషయాన్ని ప్రస్తావించారు.

కరీంనగర్–పిట్లం మధ్య 165 కిలోమీటర్ల KKY జాతీయ రహదారి ప్రతిపాదనకు తక్షణ ఆమోదం తెలిపి, పరిపాలనా మరియు ఆర్థిక అనుమతులు మంజూరు చేసి పనులను త్వరితగతిన ప్రారంభించాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు.

ప్రతిపాదిత KKY జాతీయ రహదారి ప్రయోజనాలు:

  • తెలంగాణ ఉత్తర, పశ్చిమ ప్రాంతాలకు మెరుగైన అనుసంధానం
  • మహారాష్ట్రతో వేగవంతమైన రవాణా
  • ప్రయాణ సమయం తగ్గింపు
  • వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమలకు ఊతం
  • వేములవాడ దేవస్థానానికి భక్తులకు మెరుగైన రవాణా

© 2026 Telangana Pawar Dainapatrika | All Rights Reserved.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *