స్వాతంత్ర్య సమరయోధుల స్మరణకే హర్ ఘర్ తిరంగా
ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలి: ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి
కామారెడ్డి: స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని కామారెడ్డి శాసనసభ్యులు శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో సమరయోధులు చేసిన పోరాటాలు, చేసిన త్యాగాలను నేటి తరం ఎప్పటికీ మరచిపోకూడదన్నారు. వారి త్యాగాల ఫలితంగానే మనం స్వేచ్ఛా భారతదేశంలో జీవిస్తున్నామని పేర్కొన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవాలని, వారి త్యాగాలను భావితరాలకు తెలియజేయాలని సూచించారు. దేశభక్తి భావాన్ని చాటుతూ ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
జాతీయ జెండా మన దేశ గౌరవానికి, స్వాతంత్ర్యానికి, సమైక్యతకు ప్రతీక అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి కుటుంబం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై దేశభక్తిని చాటుకోవాలని కోరారు.
