పేదల ఆకలి తీర్చాల్సిన ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యం పక్కదారి పడుతోంది. అక్రమార్కులు యథేచ్ఛగా రేషన్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల సమీపంలో భారీ ఎత్తున రేషన్ బియ్యం పట్టుబడటం స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం రాత్రి ఎలాంటి అనుమతులు లేకుండా లారీలో తరలిస్తున్న 310 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు.

జాతీయ రహదారిపై అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీసు, రెవెన్యూ విభాగాలు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నాయి. బిక్కనూరు వద్ద హైదరాబాద్ వైపు నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న లారీని ఆపి తనిఖీ చేయగా ఎలాంటి బిల్లులు లేని భారీ రేషన్ బియ్యం నిల్వలు బయటపడ్డాయి. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను ఎస్సై అనిల్, డిప్యూటీ తహసీల్దార్ కిష్టయ్య వెల్లడించారు.

ప్రాథమిక విచారణలో ఈ బియ్యాన్ని హైదరాబాద్‌లో లోడ్ చేసి, అక్కడి నుంచి నేరుగా గుజరాత్ రాష్ట్రానికి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. లారీని సీజ్ చేసి, తదుపరి విచారణ నిమిత్తం కేసు నమోదు చేశారు.