వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి: ప్రకాశం జిల్లా ఎస్పీ
ప్రకాశం జిల్లా, సెప్టెంబర్ 7: వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా, నియమ నిబంధనలకు లోబడి ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., పోలీస్ అధికారులను ఆదేశించారు. వినాయక చవితి, ఉత్సవాల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.
సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పోలీస్ అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. గణేష్ ప్రతిమలు ఏర్పాటు చేసిన మండపాలతో పాటు ఇతర ప్రదేశాల్లోనూ భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని ఆదేశించారు.
నిమజ్జనం జరిగే ప్రదేశాలు, సంబంధిత ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం, గజ ఈతగాళ్లు, వైద్య సిబ్బంది, అగ్నిమాపక పరికరాలు తదితర ఏర్పాట్లను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. రెవెన్యూ, పంచాయతీ, మున్సిపాలిటీ తదితర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
సింగిల్ విండో విధానంలో గణేష్ మండపాల అనుమతులు
సెప్టెంబర్ 14వ తేదీ నుంచి నిర్వహించనున్న వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో గణేష్ మండపాల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని జిల్లా ఎస్పీ తెలిపారు.
గణేష్ మండపాల ఏర్పాటుకు అవసరమైన పోలీస్, అగ్నిమాపక, మున్సిపల్/పంచాయతీ, విద్యుత్, రెవెన్యూ తదితర శాఖల అనుమతులను ఒకే వేదిక ద్వారా పొందేందుకు ganeshutsav.net వెబ్‌సైట్ ద్వారా సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అనుమతుల కోసం ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, సేవ పూర్తిగా ఉచితమని ఎస్పీ స్పష్టం చేశారు.
గణేష్ ఉత్సవాల నిర్వాహకులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని ఉత్సవాలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు సహకరించాలని ఎస్పీ కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణేశులను మాత్రమే ప్రతిష్ఠించాలని సూచించారు.
ఆన్‌లైన్‌లో అనుమతుల కోసం దరఖాస్తు విధానం
గణేష్ మండపం ఏర్పాటు చేయదలచిన కమిటీ సభ్యుల వివరాలతో పాటు మండపానికి సంబంధించిన ఇతర వివరాలను ganeshutsav.net వెబ్‌సైట్‌లో నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
- ముందుగా ganeshutsav.net వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి ‘New Application’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- దరఖాస్తుదారుడి మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.
- మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయాలి.
- దరఖాస్తుదారుడి పేరు, చిరునామా, కమిటీ సభ్యుల వివరాలను నమోదు చేయాలి.
- మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, అది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో నమోదు చేయాలి.
- విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు, విగ్రహ ప్రతిష్ఠ తేదీ వంటి వివరాలను నమోదు చేయాలి.
- నిమజ్జనం ఎక్కడ, ఏ సమయంలో నిర్వహిస్తారు, ఏ వాహనం ద్వారా నిమజ్జనం చేస్తారు అనే వివరాలను నమోదు చేసి దరఖాస్తును సబ్మిట్ చేయాలి.
దరఖాస్తు సబ్మిట్ చేసిన అనంతరం అప్లికేషన్ ఐడీ నంబర్ (యూనిక్ ఐడీ) జనరేట్ అవుతుంది. ఆ దరఖాస్తు పోలీస్ శాఖ అనుమతి కోసం సంబంధిత అధికారుల లాగిన్‌కు వెళుతుంది. అధికారులు దరఖాస్తును పరిశీలించి అనుమతించిన తరువాత వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వస్తాయి.
అనుమతికి సంబంధించి క్యూ ఆర్ కోడ్ కలిగిన నిరభ్యంతర పత్రం (NOC) జారీ చేస్తారు. ఈ పత్రాన్ని ప్రింట్ తీసుకుని గణేష్ మండపంలో ఉంచాలని సూచించారు. ఇందుకోసం ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఎస్పీ తెలిపారు.
వినాయక చవితి సందర్భంగా పాటించాల్సిన నిబంధనలు
- గణేష్ విగ్రహ ప్రతిష్ఠ, పందిళ్లు/మండపాల ఏర్పాటుకు ముందుగా ఒక కమిటీని ఏర్పాటు చేసి, అన్ని బాధ్యతలు ఆ కమిటీదేనని స్పష్టంగా గుర్తించాలి.
- పంచాయతీ, మున్సిపాలిటీ, నగర పాలక సంస్థ లేదా ప్రైవేట్ స్థలాల్లో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే సంబంధిత స్థల యజమాని లేదా సంబంధిత విభాగం అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.
- ఫైర్, విద్యుత్ శాఖలు సూచించిన నిబంధనలకు అనుగుణంగా పందిళ్లు/మండపాల వద్ద తగినంత ఇసుక, నీరు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు అందుబాటులో ఉంచాలి.
- విద్యుత్ వైర్లు, ప్రకాశవంతమైన లైట్ల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలి. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా వైరింగ్‌ను నిపుణుల ద్వారా సురక్షితంగా చేయించుకోవాలి.
- మండపాల వద్ద అధిక శబ్ద కాలుష్యాన్ని కలిగించే స్పీకర్లను వినియోగించకూడదు. స్పీకర్లను ఉదయం 6:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకే వినియోగించాలి.
- మైక్ ద్వారా ఎవరినీ కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం లేదా ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా రెచ్చగొట్టే ప్రచారం చేయరాదు.
- విద్యాసంస్థలు, ఆసుపత్రులు, దేవాలయాలు, చర్చిలు, మసీదులు, పోలీస్ స్టేషన్లు లేదా ఇతర ప్రభుత్వ కార్యాలయాల వద్ద మైక్ ద్వారా ఎటువంటి ప్రచారం చేయరాదు.
- రాత్రి వేళల్లో మండపాల వద్ద నిర్వహణ కమిటీ ప్రతినిధులు విధిగా కాపలా ఉండాలి. ప్రతి మండపం తమకు తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి.
- రాత్రి సమయంలో పందిళ్లు/మండపాల్లో విలువైన వస్తువులను ఉంచకూడదు.
- ఉత్సవాలు జరుగుతున్న ప్రదేశంలో కమిటీ సభ్యులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. భద్రతా పరిరక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.
- వినాయక పందిళ్లు లేదా విగ్రహాలను రోడ్డుపై ఏర్పాటు చేయరాదు. బ్యానర్లు లేదా ప్లెక్సీలను రాకపోకలకు అంతరాయం కలిగించే విధంగా రోడ్లపై ఉంచకూడదు.
- వినాయక చవితి ఉత్సవాల సమయంలో బాణసంచా వాడకూడదు.
- పందిళ్ల వద్ద, ఊరేగింపు సమయంలో అనుచిత ప్రదర్శనలు, అసభ్య నృత్యాలు జరగకుండా ఉత్సవ నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఊరేగింపు సమయంలో పోలీసుల అనుమతి లేకుండా వేషధారణలు, అధిక శబ్దం వచ్చే వాయిద్యాలు, డీజే తదితరాలకు అనుమతి ఉండదు.
- నిమజ్జన ఊరేగింపుకు అనుమతించిన సమయం, నిమజ్జనానికి కేటాయించిన ప్రదేశం, ఊరేగింపుకు కేటాయించిన మార్గాల్లో నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి.
సోషల్ మీడియా వదంతులను నమ్మవద్దు
సోషల్ మీడియాలో వచ్చే వదంతులు, నిర్ధారణ లేని వార్తలు, రెచ్చగొట్టే పోస్టులను నమ్మవద్దని, వాటిని ఫార్వర్డ్ చేయవద్దని జిల్లా ఎస్పీ సూచించారు. ఏదైనా అనుమానం లేదా సమస్య ఉంటే స్థానిక పోలీసులను సంప్రదించి వాస్తవాలను నిర్ధారించుకోవాలని కోరారు.
జిల్లా ప్రజలు, గణేష్ ఉత్సవ నిర్వాహకులు, యువత, మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల వారు పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు.
అత్యవసర పరిస్థితుల్లో డయల్–112 లేదా పోలీస్ వాట్సాప్ నంబర్ 9121102266కు, లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలని సూచించారు.