వర్షపు నీటిలో కౌన్సిలర్ నిరసన

వర్షపు నీటిలో కూర్చొని కౌన్సిలర్ నిరసన

స్టేషన్‌ రోడ్డులో జలమయమైన ప్రధాన రహదారి.. సమస్య పరిష్కరించాలని డిమాండ్

తెలంగాణ పవార్ దినపత్రిక | కామారెడ్డి జిల్లా కేంద్రం:

కామారెడ్డి పట్టణంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులు
జలమయమయ్యాయి. కామారెడ్డి–కరీంనగర్ జాతీయ రహదారిలోని
స్టేషన్ రోడ్డులో పోలీస్‌స్టేషన్‌ ఎదుట భారీగా వరద నీరు
నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

రహదారిపై నీరు వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో ఆ ప్రాంతం
కుంటను, చెరువును తలపించేలా మారిందని స్థానికులు
ఆవేదన వ్యక్తం చేశారు. వరద నీటి కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి
వాహనాల రాకపోకలు మందగించడంతో పాటు ప్రమాదాలు జరిగే పరిస్థితి
నెలకొంటోందని తెలిపారు.

ఈ మార్గంలోనే కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి
ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లో 108 వాహనాలు, రోగులను తరలించే
వాహనాలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని
ఆందోళన వ్యక్తమైంది.

సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు
46, 47వ వార్డు కౌన్సిలర్ గెరిగంటి స్వప్న–లక్ష్మినారాయణ
రహదారిపై నిలిచిన వరద నీటిలో కూర్చొని నిరసన తెలిపారు. ప్రధాన
రహదారిపై తరచూ నీరు నిలిచిపోకుండా శాశ్వత పరిష్కారం చూపాలని
వారు డిమాండ్ చేశారు.

కామారెడ్డి–కరీంనగర్ మధ్య ప్రధాన రహదారి కావడంతో ఈ సమస్యను
అధికారులు యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని కోరారు.
డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి, వర్షపు నీరు రహదారిపై నిలిచిపోకుండా
శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించకపోతే అదే ప్రదేశంలో
దీక్ష చేపడతామని కౌన్సిలర్ గెరిగంటి స్వప్న–లక్ష్మినారాయణ
హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *