“బస్సులు ఆపని బస్టాప్‌లు.. ప్రజాధనం ఖర్చు ఎందుకు?”

బస్సులు ఆపని బస్టాప్‌లకు పునరుద్ధరణ పనులెందుకు?

నాగారం మున్సిపాలిటీలో ప్రజాధనంపై టీఆర్‌పీ నాయకుల ప్రశ్నలు

మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా, నాగారం: నాగారం మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో బస్సులు నిలిపే పరిస్థితి లేకపోయినా బస్టాప్‌లకు బోర్డులు ఏర్పాటు చేయడం, సిమెంట్ పనులు, వెల్డింగ్ పనులు చేపట్టడంపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

బస్సులు ఆపని ప్రాంతాల్లో బస్టాప్‌ల పునరుద్ధరణ పేరుతో ప్రజాధనాన్ని ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ప్రజలకు నేరుగా ఉపయోగపడేలా ముందుగా ఆయా ప్రాంతాల్లో బస్సులు నిలిపేలా సంబంధిత అధికారులు, ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బస్సులు ఆగని చోట బస్టాప్‌లు ఏర్పాటు చేసినా ప్రయాణికులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని, ప్రజల అవసరాలను గుర్తించి పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని టీఆర్‌పీ నాయకులు పేర్కొన్నారు. బస్టాప్‌ల పునరుద్ధరణ పనులతో పాటు ఆయా ప్రాంతాల్లో బస్సుల నిలుపుదలపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టీఆర్‌పీ జిల్లా జాయింట్ సెక్రటరీ గండ్ర కమలాకర్ పటేల్, కార్మిక విభాగం ఉపాధ్యక్షులు రాచమల్ల లక్ష్మణ్, జిల్లా అధికార ప్రతినిధి నాయకపు రామ్ నరసయ్య, ప్రవీణ్ కుమార్, నాగరాజ్, సాయి కిరణ్, ధనావత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

— పవార్ వార్త సూత్రా, మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా ప్రతినిధి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *