కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసన.. హామీలు అమలు చేయాలని డిమాండ్
ఎంఎంసీ ఘట్కేసర్ సర్కిల్ 8వ డివిజన్ పరిధిలోని అన్నోజిగూడ వికలాంగుల కాలనీలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పోచారం డివిజన్ ప్రధాన కార్యదర్శి శేఖర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ చైర్మన్ చామకూర భద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చామకూర భద్రారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వివిధ వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థినికి స్కూటీలు, మహిళలకు రూ.2,500, యువతకు ప్రతి ఏటా లక్ష ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలుపై తాము ప్రశ్నిస్తుంటే నిరసన దీక్షలకు సంబంధించిన టెంట్లు, ఫ్లెక్సీలను పోలీసుల సహకారంతో తొలగించారని భద్రారెడ్డి ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు, కుట్రలు ఎదురైనా తాము ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేసి ప్రజలకు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. హామీలను నెరవేర్చకపోతే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
అనంతరం వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోచారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కొండల్ రెడ్డి, మాజీ రైతు సహకార సంఘం చైర్మన్ డొంకిని బిక్షపతి గౌడ్, ఘట్కేసర్ మండల పార్టీ అధ్యక్షులు రమేష్, ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు, వికలాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.