యువత హక్కుల కోసం ఐక్య పోరాటమే మార్గం: పల్లా వెంకట్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా, సెప్టెంబర్ 4: యువత హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటం అవసరమని సీపీఐ జాతీయ కార్యదర్శి, ఏఐవైఎఫ్ రాష్ట్ర 3వ మహాసభల చీఫ్ ప్యాట్రన్ పల్లా వెంకట్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 8న యాదగిరిగుట్టలో నిర్వహించనున్న ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
యాదగిరిగుట్టలోని కెఎం గ్రాండ్ ఫంక్షన్ హాల్‌లో రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘ సమావేశం ఆహ్వాన సంఘం అధ్యక్షులు యానాల దామోదర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా పల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 8న మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్న భారీ యువజన ప్రదర్శన, అనంతరం జరిగే బహిరంగ సభకు యువత, విద్యార్థులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.
దేశంలో నిరుద్యోగం, పేపర్ లీకులు, విద్యా, వైద్య రంగాల ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యం, యువతపై పెరుగుతున్న ఆర్థిక, సామాజిక భారాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. యువత సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపాల్సిన పాలకులు ప్రకటనలకే పరిమితం కాకుండా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని, ప్రభుత్వ విద్య, వైద్య రంగాలను బలోపేతం చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని డిమాండ్ చేశారు.
యువత సమస్యలపై చర్చ
ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలు సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో యాదగిరిగుట్టలో జరగనున్న నేపథ్యంలో యువత సమస్యలపై సమగ్రంగా చర్చించి, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నట్లు సమావేశంలో పేర్కొన్నారు.
విద్య, ఉపాధి, సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్యం, శాంతి, శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయ సోషలిజం కోసం యువతను మరింత సంఘటితం చేయాల్సిన అవసరం ఉందని సమావేశం పేర్కొంది.
ఏఐవైఎఫ్ 3వ రాష్ట్ర మహాసభల గౌరవ అధ్యక్షులు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. ప్రజా సంపదను కార్పొరేట్లకు అప్పగించే విధానాలను, యువత భవిష్యత్తును దెబ్బతీసే విధానాలను వ్యతిరేకిస్తూ ఏఐవైఎఫ్ ఉద్యమాలను మరింత విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు. “యువత సంఘటితమైతే… సమాజం మారుతుంది” అనే స్ఫూర్తితో సెప్టెంబర్ 8న జరిగే భారీ యువజన ప్రదర్శన, మధ్యాహ్నం 3 గంటలకు జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ తీర్పారీ వెంకటేశ్వర్లు, చేపూరి కొండల్, జిల్లా కార్యదర్శి పేరబోయిన మహేందర్, తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు కురుమీద్ది శ్రీనివాస్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గోదా శ్రీరాములు, సీపీఐ జిల్లా కార్యదర్శి కళ్లెం కృష్ణ, బండి జంగయ్య, కొల్లూరి రాజయ్య, ఉప్పల ముత్యాలు, ఎండీ. ఇమ్రాన్, పల్లె శేఖర్ రెడ్డి, ఏసాల అశోక్, చిగుర్ల లింగం, కూసుమని హరీషచంద్ర, సీపీఐ యాదగిరిగుట్ట మండల కార్యదర్శి కళ్లేపల్లి మహేందర్, సీపీఐ యాదగిరిగుట్ట మండల కార్యదర్శి, కౌన్సిలర్ బబ్బురీ శ్రీధర్‌తో పాటు యువజన, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.