కేంద్రం మెచ్చిన
టీచరమ్మ
బొంపెల్లి భవానికి జాతీయ గుర్తింపు
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రైవేటు స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతూ, విద్యా రంగంలో విశేష కృషి చేస్తున్న గాంధారి బాలికల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవాని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.
🎥 ప్రత్యేక వీడియో
కామారెడ్డి జిల్లా, గాంధారి: ముగ్గురు ఆడపిల్లలు. అయినా అమ్మానాన్నలు వాళ్ల చదువుకే ప్రాధాన్యమిచ్చారు. వాళ్ల ప్రభావంతో ఆమె కూడా అత్యుత్తమ విద్య అందరికీ అందాలని తాపత్రయపడుతున్నారు.
ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. ఆ ప్రయత్నానికి గుర్తింపుగానే తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలి పురస్కారానికి ఎంపికయ్యారు బొంపెల్లి భవాని.
భవానిది కామారెడ్డి జిల్లాలోని గాంధారి. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన ఆమెకు తల్లిదండ్రుల కష్టాన్ని చూస్తూ ఎదగడానికి చదువే బలమైన ఆయుధమనే స్పష్టత చిన్ననాడే ఏర్పడింది.
ఆడపిల్లలకు చదువే తొలి ప్రాధాన్యమని తల్లిదండ్రులు చెప్పేవారని, అదే తనను విద్యార్థుల కోసం అనుక్షణం తపించేలా చేస్తోందని భవాని పేర్కొన్నారు.
మొదట్లో ప్రైవేటు స్కూల్లో చదివిన ఆమె తరువాత ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో విద్యను కొనసాగించారు. అప్పట్లో తమ పాఠశాలకు ఒకే భవనం ఉండటంతో అన్ని తరగతులకు ఒకేసారి క్లాసులు నిర్వహించడం సాధ్యం కాక ఒక్కపూటే తరగతులు నిర్వహించేవారు.
ఇంటర్ వరకూ ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ 860 మార్కులు సాధించి ప్రభుత్వ కళాశాల విద్యార్థుల్లో జిల్లాలోనే టాపర్‌గా నిలిచారు.
డీఎస్సీ రాసి ఎస్‌జీటీగా కొలువు సాధించినప్పటి నుంచి తాను ఎదుర్కొన్న ఇలాంటి పరిస్థితులు ఇతర విద్యార్థులకు రావొద్దని కృషి చేస్తున్నారు.
2018 నుంచి గాంధారి బాలికల ప్రాథమిక పాఠశాలలో భవాని పనిచేస్తున్నారు. ఆమె బదిలీపై అక్కడికి వచ్చేనాటికి విద్యార్థుల సంఖ్య కేవలం 40 మాత్రమే.
తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలను సర్కారు బడి బాట పట్టించేలా చేశారు. యోగా, కంప్యూటర్స్, శాస్త్రీయ సంగీతం, నృత్యం, ఆటలు వంటి అనేక కార్యక్రమాలను పాఠశాలలో ప్రవేశపెట్టారు.
నిధులు సేకరించి మరీ పాఠశాలకు మౌలిక సదుపాయాలు కల్పించారు. ఇంగ్లిష్ కర్సివ్ రైటింగ్‌తోపాటు అనర్గళంగా మాట్లాడటంలో శిక్షణ, లెక్కలపై భయం పోగొట్టడానికి చిట్కాలు, అబాకస్ వంటి అంశాలను నేర్పిస్తున్నారు.
పోటీపరీక్షలకు సిద్ధం చేయడం, వెనకబడిన పిల్లలకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం చేస్తున్నారు. పిల్లలను పోస్టాఫీస్, పోలీస్‌స్టేషన్, పర్యటక ప్రాంతాలకు తీసుకెళ్లి అనుభవపూర్వకంగా నేర్చుకునేలా చేస్తున్నారు.
తన పేరిటే యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి విద్యార్థులకు ఆన్‌లైన్‌లోనూ బోధిస్తున్నారు. ప్రవేశాలు తగ్గుతున్న ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచారు.
విద్యావ్యవస్థ అభివృద్ధికి ఫిన్లాండ్ అమలు చేస్తున్న విధానాలపై అవగాహన పెంచుకోవడానికి పాఠశాల విద్యాశాఖ 28 మంది ప్రధానోపాధ్యాయులను ఎంపిక చేసింది. ఆ జాబితాలోనూ భవానికి చోటు దక్కింది.
ఇటీవల ముఖ్యమంత్రి చేతులమీదుగా ‘రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ అందుకున్నారు.
“నేనిలా ఉన్నానంటే మా ఉపాధ్యాయుల చొరవే కారణం. నాడు వాళ్లు చూపిన బాటలోనే నేనూ నడుస్తున్నా” అని భవాని చెబుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలలపై ఉండే చిన్నచూపును పోగొట్టడానికి ఆమె ప్రయత్నిస్తున్నారు. పేద, మధ్యతరగతి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు మెరుగైన ఉపాధికి బాటలు వేయడమే లక్ష్యంగా సాగుతున్నారు.
భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలో సీటు కావాలని ఎదురుచూసే రోజులు రావాలన్నది ఆమె కోరిక. ఉపాధ్యాయురాలిగా 18 ఏళ్ల అనుభవంలో తన దగ్గర చదువుకున్న ఎంతోమందిని ఉన్నత స్థాయికి చేరుకునేలా చేశారు.