సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు.. పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ వేటు
సోషల్ మీడియాలో ఒక ప్రజా ప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
సోషల్ మీడియాలో ఒక ప్రజా ప్రతినిధిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు గాను 2018 బ్యాచ్‌కు చెందిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్ కె. అనిల్‌పై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
ప్రస్తుతం సైబరాబాద్ CAR నుంచి ఆర్డర్ టు సర్వ్‌లో భాగంగా హైదరాబాద్ CAR హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న కె. అనిల్ సోషల్ మీడియాలో ప్రజా ప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు అధికారుల దృష్టికి వచ్చింది.
పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగి క్రమశిక్షణ, వృత్తిపరమైన ప్రవర్తన, గౌరవప్రదమైన వ్యవహారశైలిని పాటించాల్సి ఉంటుందని సీపీ డా. ఎం. రమేష్ స్పష్టం చేశారు.
సోషల్ మీడియాను ఉపయోగించే సమయంలో కూడా పోలీస్ సిబ్బంది బాధ్యతాయుతంగా, సంయమనంతో వ్యవహరించాలని సీపీ సూచించారు.
పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకు గాను నిబంధనల ప్రకారం కె. అనిల్‌పై చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేశారు.