ఎల్లారెడ్డిలో ఘనంగా కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలు
ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ముదిరాజ్ సంఘ భవనంలో శుక్రవారం కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి వేడుకలను ముదిరాజ్ సంఘ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఎల్లారెడ్డి ముదిరాజ్ మండల అధ్యక్షులు ప్యాలాల రాములు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు బట్టు విట్టల్ ముదిరాజ్ మాట్లాడుతూ.. కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ 133వ జయంతి వేడుకలను ఎల్లారెడ్డిలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.
కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ హైదరాబాద్‌లో సామాజిక, రాజకీయ, విద్యా రంగాల్లో పనిచేసిన నాయకుడిగా సేవలందించారని బట్టు విట్టల్ ముదిరాజ్ తెలిపారు. రచయిత, పాత్రికేయుడు, విద్యావేత్త, మున్సిపల్ కౌన్సిలర్‌గా కూడా ఆయన పనిచేశారని పేర్కొన్నారు. 1957–1958లో హైదరాబాద్ తొలి మేయర్‌గా పనిచేశారని తెలిపారు.
పేద ముదిరాజ్ కుటుంబంలో జన్మించిన కృష్ణస్వామి ముదిరాజ్ కష్టపడి విద్యాభ్యాసం చేశారని, చాదర్‌ఘాట్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్, నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించారని వివరించారు. అనంతరం బొంబాయిలో ముద్రణ, ప్రచురణ సాంకేతికతపై శిక్షణ పొందారని తెలిపారు.
కొంతకాలం నిజాం ప్రభుత్వ ప్రధానమంత్రి మహారాజ్ కిషన్ ప్రసాద్ వద్ద ప్రైవేట్ కార్యదర్శిగా, ఆ తర్వాత ఆడిటర్ జనరల్ కార్యాలయంలో పనిచేశారని బట్టు విట్టల్ ముదిరాజ్ పేర్కొన్నారు. చరిత్ర, జర్నలిజం, ప్రచురణ రంగాలపై కృష్ణస్వామి ముదిరాజ్‌కు ఆసక్తి ఉండేదన్నారు.
‘డెక్కన్ స్టార్’ అనే ఆంగ్ల పత్రికతో పాటు ‘మసావత్’, ‘న్యూ ఎరా’ వంటి ఉర్దూ పత్రికలకు ఆయన సంపాదకత్వం వహించారని తెలిపారు. సియాసత్, రయ్యత్, రహనుమా-ఎ-దక్కన్, ఎమ్రోజ్ వంటి పత్రికల్లో వ్యాసాలు రాశారని పేర్కొన్నారు. 1925లో స్వంత ముద్రణాలయాన్ని స్థాపించారని తెలిపారు.
1929లో హైదరాబాద్ నగర చరిత్ర, సంస్కృతి, భవనాలు, ప్రముఖ వ్యక్తుల గురించి వివరించే ‘Pictorial Hyderabad’ గ్రంథాన్ని ప్రచురించారని, ఈ పుస్తకం హైదరాబాద్ చరిత్రకు ముఖ్యమైన దస్తావేజుగా గుర్తించబడిందని బట్టు విట్టల్ ముదిరాజ్ తెలిపారు.
1922లో ముదిరాజ్ మహాసభను స్థాపించి, సమాజంలో ఐక్యత, విద్య, సామాజిక చైతన్యం పెంపొందించేందుకు కృష్ణస్వామి ముదిరాజ్ కృషి చేశారని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బాలకృష్ణ ముదిరాజ్, మండల అధ్యక్షులు ప్యాలాల రాములు, పట్టణ అధ్యక్షులు కోర్న నారాయణ, ఉపాధ్యక్షులు నిల సిద్దిరాములు, మర్రి ప్రకాష్, మర్రి బాలకిషన్, జక్కుల సంతోష్, జక్కుల అశోక్, మాజీ సర్పంచ్ బాలయ్య, మాజీ సర్పంచ్ ఎల్లయ్య, మాజీ ఎంపీటీసీ సంతోష్, జనముల పోచయ్య, నిజ్జన మహేందర్, కెబి రాజు, గగన్, మర్రి సత్యం తదితరులు పాల్గొన్నారు.