నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి వానాకాలం పంటలకు నీటి విడుదల
ఆయకట్టు రైతుల పంటలను కాపాడేందుకు ప్రణాళికాబద్ధంగా సాగునీటి పంపిణీ
నిజాంసాగర్ మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి వానాకాలం పంటల సాగుకు ప్రధాన కాలువ ద్వారా ఈరోజు నీటిని విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి, జుక్కల్ శాసనసభ్యులు శ్రీ తోట లక్ష్మీకాంతారావు కలిసి సాగునీటి విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో బాన్సువాడ RDO శ్రీ రవీందర్ రెడ్డి, కామారెడ్డి DCC అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. 2026 వర్షాకాలంలో ఎల్‌నినో ప్రభావం కారణంగా జూన్, జూలై, ఆగస్టు మూడు నెలల్లో రాష్ట్రంలో సుమారు 36 శాతం వర్షపాతం లోటు ఉన్నప్పటికీ, నిజాంసాగర్ క్యాచ్‌మెంట్ ప్రాంతంలో కురిసిన వర్షాలతో ప్రాజెక్టులో నీటి నిల్వలు పెరిగాయని తెలిపారు.
నిజాంసాగర్‌లో 13.3 టీఎంసీల నీటి నిల్వ
ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో సుమారు 13.3 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని పోచారం శ్రీనివాస రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల నీటి నిల్వలపై ప్రభుత్వం నిర్వహించిన సమీక్షలో భాగంగా, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు నిజాంసాగర్ కింద ఉన్న ఆయకట్టు రైతుల పంటలను కాపాడేందుకు అందుబాటులో ఉన్న నీటిని సద్వినియోగంగా పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
చీఫ్ ఇంజనీర్ల కమిటీ, ఇంజనీరింగ్ అధికారులు ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా నిజాంసాగర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలోని ప్రాజెక్టుల నుంచి వర్షాకాల పంటలకు నీటిని విడుదల చేస్తున్న మొదటి ప్రాజెక్టుగా నిజాంసాగర్ నిలుస్తోందని తెలిపారు.
నిజాంసాగర్ ప్రాజెక్టు కింద సుమారు 1.30 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టు రైతుల పంటలను కాపాడేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా, ప్రణాళికాబద్ధంగా పంపిణీ చేయాలని నిర్ణయించారు.
15 రోజుల పాటు నీటి విడుదల
రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మొదట 15 రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నట్లు పోచారం తెలిపారు. అనంతరం పరిస్థితిని బట్టి వారం లేదా పది రోజుల పాటు విరామం ఇచ్చి, మళ్లీ నీటిని విడుదల చేస్తూ చివరి పంట వరకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రస్తుతం నాలుగు రోజులుగా ఎండలు తీవ్రంగా ఉన్నాయని, ఎల్‌నినో ప్రభావం కూడా కొనసాగుతున్న నేపథ్యంలో సెప్టెంబర్‌లోనూ వర్షపాతం లోటు ఉండే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని ప్రతి రైతు ఎంతో జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు.
పై, కింది ఆయకట్టు రైతులు సమన్వయంతో నీటిని వినియోగించాలి
పై ఆయకట్టు రైతులు ఎక్కువ నీటిని వినియోగిస్తే కింది ఆయకట్టు రైతులకు నీరు అందదని పోచారం పేర్కొన్నారు. అప్పుడు కాలువల్లో ఎక్కువ క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి వస్తుందని, దీనివల్ల నిజాంసాగర్ నీటి నిల్వలు త్వరగా తగ్గిపోయే ప్రమాదం ఉంటుందని వివరించారు.
కాబట్టి పై ఆయకట్టు, కింది ఆయకట్టు రైతులు పరస్పరం సహకరించుకుంటూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. అందరూ సమన్వయంతో వ్యవహరిస్తే ప్రతి రైతు పంటను కాపాడుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
బాన్సువాడ, జుక్కల్, బోధన్ నియోజకవర్గాలతో పాటు నిజాంసాగర్ నీటిపై ఆధారపడిన ఆయకట్టు ప్రాంతాల రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పోచారం తెలిపారు. రైతుల పంటలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన మేరకు నీటి సరఫరాను కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకుని, అధికారులు–రైతులు సమన్వయంతో పనిచేస్తే ఈ వర్షాకాల పంటలను కాపాడుకోవచ్చని పోచారం శ్రీనివాస రెడ్డి తెలిపారు.