అంజనాద్రి క్షేత్రం నుంచి ఎల్లారెడ్డి రామాలయం వరకు మహా పాదయాత్ర
సెప్టెంబర్ 5న శ్రావణ మాసం ముగింపు సందర్భంగా పాదయాత్ర.. కరపత్రం విడుదల చేసిన నిర్వాహకులు
మహా పాదయాత్ర వివరాలు
ఎల్లారెడ్డి, ఆగస్టు 29: శ్రావణ మాసం చివరి శనివారాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నిర్వహించే మహా పాదయాత్రకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిజాంసాగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని అంజనాద్రి క్షేత్రం నుంచి ఎల్లారెడ్డి పట్టణంలోని రామాలయం వరకు ఈ మహా పాదయాత్రను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు కిషోర్ పంతులు, మోహన్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా ఎల్లారెడ్డి రామాలయం వద్ద మహా పాదయాత్రకు సంబంధించిన కరపత్రాన్ని నిర్వాహకులు విడుదల చేశారు. సెప్టెంబర్ 5, 2026 శనివారం ఉదయం 7 గంటలకు బ్రాహ్మణపల్లిలోని అంజనాద్రి క్షేత్రం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించారు.
అంజనాద్రి క్షేత్రం నుంచి ప్రారంభమయ్యే మహా పాదయాత్ర నర్సింగరావుపల్లి, పిట్లం చౌరస్తా, వడ్డేపల్లి గేట్, మాగి గేట్, గోర్గల్, నిజాంసాగర్, సుల్తాన్ నగర్, బొగ్గుగుడిసె, హాసన్‌పల్లి, కళ్యాణి వీరహనుమాన్ మందిరం, తిమ్మారెడ్డి గేట్ మీదుగా కొనసాగుతుంది.
అనంతరం ఎల్లారెడ్డి పట్టణ పురవీధుల గుండా పాదయాత్ర కొనసాగి చివరగా ఎల్లారెడ్డి రామాలయం వద్దకు చేరుకుంటుందని నిర్వాహకులు తెలిపారు.
శ్రావణ మాసం ముగింపు సందర్భంగా భక్తులు ఐక్యంగా పాదయాత్రలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
ఎల్లారెడ్డి రామాలయంలో కరపత్రం విడుదల కార్యక్రమంలో రామాలయం సిద్ది ప్రకాష్, వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ సభ్యులతో పాటు యోగ పరివార్ ప్రతినిధులు పాల్గొన్నారు. మహా పాదయాత్రను విజయవంతం చేసేందుకు భక్తులు, ఆయా ప్రాంతాల ప్రజలు సహకరించాలని నిర్వాహకులు కోరారు.