గాంధారి ఏటీఎం చోరీ కేసులో కీలక నిందితుడి అరెస్ట్

రూ.25.45 లక్షల చోరీ కేసులో రాజస్థాన్‌లో పట్టుకున్న పోలీసులు

దర్యాప్తులో కృషి చేసిన ఎస్సై ఆంజనేయులుకు ఎస్పీ అభినందనలు

పవార్ వార్త, కామారెడ్డి, అక్టోబర్ 27: గాంధారి మండల కేంద్రంలో సంచలనం సృష్టించిన ఎస్‌బీఐ ఏటీఎం చోరీ కేసులో కీలక పురోగతి నమోదైంది. నైటీలు, మాస్కులు ధరించి గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను ధ్వంసం చేసి రూ.25,45,900 అపహరించిన కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన రషీద్‌ (30)ను రాజస్థాన్‌లో కామారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర అక్టోబర్ 26న వెల్లడించారు.

నైటీలు ధరించి ఏటీఎంలో చోరీ

అక్టోబర్ 10, 11 తేదీల మధ్య రాత్రి గాంధారి ప్రధాన రహదారిలోని ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రంలో చోరీ జరిగింది. ముగ్గురు వ్యక్తులు నైటీలు, ముఖాలకు మాస్కులు ధరించి వచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.

సీసీ కెమెరాలపై నల్లరంగు స్ప్రే చల్లి, గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేశారు. నగదు ఉన్న ఐదు బాక్సులను అపహరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై గాంధారి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఐదు రాష్ట్రాల్లో పోలీసుల గాలింపు

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాలతో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.

సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ కుమార్, ఎస్సైలు ఆంజనేయులు, పుష్పరాజ్ తదితరులు సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి దర్యాప్తు చేపట్టారు.

నిందితులు నల్లరంగు స్కార్పియో వాహనాన్ని ఉపయోగించడంతోపాటు పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు నకిలీ నంబర్ ప్లేట్లు మార్చినట్లు దర్యాప్తులో గుర్తించారు.

రాజస్థాన్‌లో ప్రధాన నిందితుడి అరెస్ట్

చోరీ అనంతరం నిందితులు మహారాష్ట్ర మీదుగా రాజస్థాన్‌కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి పోలీసుల సహకారంతో గాలింపు కొనసాగించారు.

అక్టోబర్ 20న రాజస్థాన్‌లోని బరోడామేవ్ సమీపంలో భరత్‌పూర్ రోడ్డుపై బస్సు కోసం ఎదురుచూస్తున్న రషీద్‌ను ప్రత్యేక బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం ట్రాన్సిట్ వారెంట్‌పై కామారెడ్డికి తరలించారు.

దర్యాప్తులో భాగంగా నల్లరంగు స్కార్పియో వాహనం, రూ.29,400 నగదు, రెండు మొబైల్ ఫోన్లు, గ్యాస్ కట్టింగ్ పరికరాలు, నకిలీ నంబర్ ప్లేట్లు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఎస్సై ఆంజనేయులుకు ఎస్పీ అభినందనలు

ఈ కేసు దర్యాప్తులో కృషి చేసిన పిట్లం ఎస్సై ఆంజనేయులును జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ప్రత్యేకంగా అభినందించారు. అందిన సమాచారం ప్రకారం ఆయనకు నగదు రివార్డు కూడా అందజేశారు.

గతంలో గాంధారి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన ఆంజనేయులు, ఈ కేసు దర్యాప్తులో ప్రత్యేక బృందంతో కలిసి పనిచేశారు.

కేసు ఛేదనలో పాల్గొన్న డీఎస్పీ శ్రీనివాసరావు, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ కుమార్, ఎస్సై పుష్పరాజ్‌తోపాటు ఇతర పోలీసు సిబ్బందిని కూడా జిల్లా ఎస్పీ అభినందించారు.

మిగతా నిందితుల కోసం గాలింపు

ఈ ముఠాకు కరీంనగర్ ప్రాంతంలో జరిగిన ఇతర ఏటీఎం చోరీలతోనూ సంబంధం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. గాంధారి కేసులో పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.

మొత్తం అపహరించిన నగదులో ఇప్పటివరకు రూ.29,400 స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడైంది. మిగిలిన నగదు ఆచూకీ, ఇతర నిందితుల అరెస్టుపై స్పష్టత రావాల్సి ఉంది.

0 మంది ఇష్టపడ్డారు
షేర్
డౌన్‌లోడ్న్యూస్ పేపర్ క్లిప్పింగ్ • హై క్వాలిటీ

మరిన్ని వార్తలు

వ్యాఖ్యానించండి