కామారెడ్డిలో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన
కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉత్తరాఖండ్‌లో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని, కుల వివక్షకు పాల్పడిన ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ నిరసనకు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ నాయకత్వం వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని రాహుల్ గాంధీకి మద్దతుగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ.. రాజ్యాంగ విలువలు, సామాజిక న్యాయం, సమానత్వం, దళితుల గౌరవం కోసం ప్రశ్నించిన రాహుల్ గాంధీపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఉత్తరాఖండ్‌లో కుల వివక్షకు పాల్పడిన ఘటనకు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.
కాంగ్రెస్ పార్టీ పోరాటం ఒక వ్యక్తి కోసం మాత్రమే కాదని, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం, సమానత్వం, దళితుల ఆత్మగౌరవం కోసం అని ఏలే మల్లికార్జున్ పేర్కొన్నారు. కుల వివక్షకు తావులేకుండా ప్రతి పౌరుడి రాజ్యాంగ హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, TPCC జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ ఐరేని సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, డీసీసీ కార్యవర్గ సభ్యులు, సీనియర్ నాయకులు, మండల–బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్, SC, ST, BC, మైనారిటీ సెల్‌ల నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు కూడా నిరసనలో పాల్గొన్నారు.
నిరసన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ గాంధీపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను ఉపసంహరించాలని, కుల వివక్షకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాజ్యాంగాన్ని కాపాడి సామాజిక న్యాయాన్ని సాధించాలని నినాదాలు చేశారు.
రాహుల్ గాంధీపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను ఉపసంహరించడం, కుల వివక్షకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడం, దళితుల గౌరవం మరియు రాజ్యాంగ హక్కులను పరిరక్షించడం వంటి అంశాలను కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్లుగా పేర్కొంది. రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం, సమానత్వం కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఏలే మల్లికార్జున్ తెలిపారు.