టీపీఓ గుండు వాణిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు
రూ.75 వేల లంచం కేసు.. ఇప్పుడు రూ.5.41 కోట్ల ఆస్తుల గుర్తింపు
ఇవి కూడా చదవండి
పవార్ వార్త, మొయినాబాద్: మోయినాబాద్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి గుండు వాణిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు సోమవారం ఏకకాలంలో 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో స్థిర, చరాస్తులు కలిపి అధికారిక విలువ ప్రకారం రూ.5.41 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది. వాటి బహిరంగ మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండవచ్చని తెలిపింది.
8 ప్రాంతాల్లో ఏసీబీ తనిఖీలు
గుండు వాణి నివాసం, కార్యాలయంతో పాటు బంధువులు, అనుచరులకు సంబంధించిన ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఈ సోదాల్లో మహబూబ్‌నగర్, జనగామ జిల్లాల్లో రెండు ఓపెన్ ప్లాట్లు, అత్తాపూర్‌లో ఫ్లాట్, జీ+2 భవనం, వ్యవసాయ భూములు గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు.
నగదు, షేర్లు, వైన్స్ పెట్టుబడులు
ఆస్తుల తనిఖీల్లో రూ.5.47 లక్షల నగదు, రూ.50 లక్షల వైన్స్ పెట్టుబడి, రూ.1.30 కోట్ల షేర్లు, బ్యాంకు నిల్వలు, బంగారు ఆభరణాలు, వాహనాలు, గృహోపకరణాలు ఉన్నట్లు ఏసీబీ వెల్లడించింది. స్థిర, చరాస్తుల అధికారిక విలువను కలిపి రూ.5.41 కోట్లకు పైగా ఉన్నట్లు తెలిపింది.
గతంలో రూ.75 వేల లంచం కేసు
గత సెప్టెంబర్ 30న మోయినాబాద్ మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న సమయంలో గుండు వాణి పంచాయతీ కార్యదర్శి ద్వారా రూ.75 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. ఆ కేసులో ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆ లంచం కేసులో గుండు వాణి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్లు వెల్లడించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిర్వహించిన సోదాల్లో గుర్తించిన ఆస్తుల వివరాలను ఏసీబీ ప్రకటించింది.
ఆస్తుల కేసులో గుండు వాణి లేదా ఆమె తరఫు స్పందన ప్రచురణ సమయానికి అందలేదు.












