కరువు నివారణకు నీటి పొదుపే మార్గం.. ఇన్ఫినిటీ స్కూల్ విద్యార్థుల ప్రదర్శన

ఎల్ నినో ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించిన విద్యార్థులు

పవార్ వార్త, ఎల్లారెడ్డి:
ఎల్ నినో ప్రభావాలతో వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు నీటి పొదుపు అవసరాన్ని తెలియజేస్తూ ఎల్లారెడ్డిలోని ఇన్ఫినిటీ స్కూల్ ఆఫ్ ఎక్సలెంట్ విద్యార్థులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సమీపంలోని ప్రధాన రహదారి వద్ద ప్రదర్శన ద్వారా ప్రజలకు పలు సూచనలు చేశారు.
నీటి పొదుపుపై విద్యార్థుల సందేశం
ఎల్ నినో అంటే ఏమిటి, దాని ప్రభావాలు ఎలా ఉంటాయి, వాటిని ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలను విద్యార్థులు ప్రదర్శనలో వివరించారు. నీటిని పొదుపుగా వినియోగించాలని, తాగునీరు, సాగునీటిని వృథా చేయకుండా కాపాడుకోవాలని సూచించారు.
ఇళ్లలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం, పొలాల్లో పంటకుంటలు నిర్మించడం, వాగుల వద్ద చెక్‌డ్యామ్‌లు ఏర్పాటు చేయడం ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసుకోవచ్చని వివరించారు.
కరువు నివారణకు పాటించాల్సిన చర్యలు
విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని, రైతులు తక్కువ నీటితో, తక్కువ వ్యవధిలో పండే పంటలను సాగు చేయాలని విద్యార్థులు సందేశమిచ్చారు. ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవాల్సిన అవసరాన్ని కూడా ప్రదర్శన ద్వారా తెలియజేశారు.
ఈ సందర్భంగా ‘గుండెను తట్టి లేపుదాం.. బొట్టు బొట్టును ఒడిసి పట్టుదాం.. కరువు రక్కసిని పారదోలుదాం’ అనే గీతాన్ని ఆలపించారు. ‘జాగోరే.. జాగోరే.. జనచైతన్యం రావాలి’ అంటూ పాడిన పాట ప్రజలను ఆకట్టుకుంది.
ఉపాధ్యాయుల భాగస్వామ్యం
ప్రిన్సిపల్ ప్రవీణ జోషి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమ్యశ్రీ, సునీత, స్వర్ణలత, నాగమణి, అమీనా, ప్రియాంక, అనురాధ, కృష్ణవేణి, కృష్ణ, భాగ్య తదితరులు పాల్గొన్నారు.

0 మంది ఇష్టపడ్డారు
షేర్
డౌన్‌లోడ్న్యూస్ పేపర్ క్లిప్పింగ్ • హై క్వాలిటీ

మరిన్ని వార్తలు

వ్యాఖ్యానించండి