గిరిజన చరిత్రపై విద్యార్థులకు పోటీలు.. కలెక్టర్ సూచనలు
బిర్సా ముండా జయంతి సందర్భంగా జనజాతీయ గౌరవ దివస్
ఇవి కూడా చదవండి
పవార్ వార్త, కామారెడ్డి: గిరిజనుల చరిత్ర, స్వాతంత్ర్య పోరాటంలో వారి పాత్రను ప్రజలకు తెలియజేసేందుకు నవంబర్ 1 నుంచి 15 వరకు జనజాతీయ గౌరవ దివస్ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, గిరిజన గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో జనజాతీయ గౌరవ దివస్ కార్యక్రమాల పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు.
విద్యార్థులకు వివిధ పోటీలు
నవంబర్ 2 నుంచి 15 వరకు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లో గిరిజన చరిత్ర, స్వాతంత్ర్య పోరాటంపై వ్యాసరచన, చిత్రలేఖనం, నినాదాలు, కథలు, కవితలు, క్విజ్ పోటీలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
గిరిజనుల చరిత్ర, వారసత్వ సంపద, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా పోరాటం, త్యాగాలు, గిరిజన సమాజ అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు.
గిరిజన కళలు, పర్యావరణ కార్యక్రమాలు
గిరిజన కళలు, చేతివృత్తులు, సంగీతం, నృత్యాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. గిరిజన కళా ప్రదర్శనలతో పాటు మొక్కల నాటడం, పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన గిరిజన ప్రముఖులు, కళాకారులను సన్మానించాలని చెప్పారు.
నవంబర్ 15న భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా జనజాతీయ గౌరవ దివస్ నిర్వహించి ఆయనకు నివాళులర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమాల నిర్వహణలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
















