వివక్షత లేని సమాజం కోసం అన్ని సామాజిక వర్గాలను ఉద్యమ శక్తులుగా మలుద్దాం: ఎమ్మార్పీఎస్
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుల సమావేశం నిర్వహించారు. సమాజంలో ఎలాంటి వివక్షత లేకుండా అన్ని సామాజిక వర్గాల సమస్యల పరిష్కారానికి వ్యక్తులను ఉద్యమ శక్తులుగా మలచాల్సిన సమయం ఆసన్నమైందని ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంథని సామ్యెల్ మాదిగ అన్నారు.
ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్సీతో పాటు అనుబంధ విభాగాల పునర్నిర్మాణంలో భాగంగా ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. అన్ని విభాగాల సంస్థాగత నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని, సామాజిక ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సారథ్యంలో అన్ని విభాగాల సంస్థాగత నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు మంథని సామ్యెల్ మాదిగ తెలిపారు. ఈ నెల 10న ములుగు జిల్లా మేడారంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులతో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
కామారెడ్డి పట్టణ అధ్యక్షులు మర్రిపల్లి అరుణ్ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మంథని సామ్యెల్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సమావేశంలో సీనియర్ నాయకులు కంతి పద్మారావు మాదిగ, కొత్తోల్ల యాదగిరి మాదిగ, బట్ట వెంకట్రాములు మాదిగ, పెద్దబూరి గంగారాం మాదిగ, కౌడి భూపతి మాదిగ, నాగిరెడ్డిపేట్ సాయిలు, యువ నాయకులు గుడ్ల లక్ష్మణ్ మాదిగ, చిన్న సాయిలు మాదిగ, లెగ్గెల రాజు, మహిళా విభాగం నాయకురాలు సట్టిగారి లక్ష్మి మాదిగ తదితరులు పాల్గొన్నారు.