దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిది.. కామారెడ్డిలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జిల్లా ఉపాధ్యాయ పురస్కారాలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి ఆలయంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల కార్యక్రమాన్ని కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యులు చిలువేరి మారుతి మాట్లాడుతూ, దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదని, సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా పెరిగినా ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎన్నటికీ రావని అన్నారు. విద్యార్థులకు పుస్తక జ్ఞానాన్ని కాకుండా సామాజిక అంశాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత నేటితరం ఉపాధ్యాయుల పైన ఉందని, ఆ దిశగా విద్యార్థులకు మార్గదర్శనం చేయాలని వారు అన్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న 16 మంది ఉపాధ్యాయులకు ఈ పురస్కారాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమ సమన్వయకర్త, ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని, పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉపాధ్యాయుల పైన ఎంతగానో ఉందని అన్నారు. ఉపాధ్యాయుడి మార్గదర్శకత్వమే విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకువెళుతుందని, నిస్వార్థంగా సేవ చేసేవారికి అవార్డులు వస్తాయని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్, కామారెడ్డి రక్తదాతల సమూహ గౌరవ అధ్యక్షులు డాక్టర్ వేద ప్రకాష్, అధ్యక్షులు జమీల్ అహ్మద్, ఐవిఎఫ్ జిల్లా విభాగం నాయకులు దొంతి సుధాకర్, కోశాధికారి కస్వ వెంకన్న, ఎర్రం విజయ్, బుక్క రజని, గజవాడ అన్నపూర్ణ, పర్ష వెంకటరమణ, ఎల్లంకి సుదర్శన్, భీమ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.