గర్భిణుల నమోదు నుంచి టీకాల వరకు.. వైద్య సిబ్బందికి DM&HO ఆదేశాలు
30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ బీపీ, షుగర్ పరీక్షలు పూర్తి చేయాలి
ఇవి కూడా చదవండి
కామారెడ్డి జిల్లాలో గర్భిణుల నమోదు, చిన్నారుల టీకాలు, బీపీ, షుగర్ పరీక్షలు, క్షయ వ్యాధి నియంత్రణ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జె. వెంకటి వైద్యాధికారులను ఆదేశించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పవార్ వార్త, కామారెడ్డి: ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా వైద్య సిబ్బంది పనిచేయాలని DM&HO డాక్టర్ జె. వెంకటి సూచించారు. అక్టోబర్ 30న కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయ సమావేశ మందిరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ప్రోగ్రామ్ అధికారులు, పర్యవేక్షణ సిబ్బందితో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల ప్రగతిపై విస్తృత సమీక్ష నిర్వహించారు.
గర్భిణుల నమోదు, హైరిస్క్ కేసులపై ప్రత్యేక దృష్టి
ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గర్భిణుల వివరాలను మొదటి త్రైమాసికంలోనే 100 శాతం ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని DM&HO ఆదేశించారు. రక్తహీనత, అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలున్న హైరిస్క్ గర్భిణులను ముందుగానే గుర్తించి ప్రత్యేక వైద్య చికిత్స అందించాలని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే సురక్షిత ప్రసవాలు జరిగేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని, మాతా శిశు మరణాలను నివారించేందుకు వైద్యులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.
చిన్నారుల టీకాల్లో ఒక్క డోసు కూడా మిస్ కావొద్దు
సార్వత్రిక టీకాల కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం అన్ని టీకాలు అందేలా చూడాలని ఆదేశించారు. ముఖ్యంగా వలస కూలీల పిల్లలు, మారుమూల తండాలు, గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
టీకా మందుల నాణ్యత దెబ్బతినకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని కోల్డ్ చైన్ పాయింట్లను పర్యవేక్షణ అధికారులు నిరంతరం తనిఖీ చేయాలని స్పష్టం చేశారు.
30 ఏళ్లు పైబడిన వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు
30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్ పరీక్షలను త్వరితగతిన పూర్తి చేయాలని వైద్యాధికారులకు సూచించారు. వ్యాధులతో బాధపడుతున్న వారికి అవసరమైన మందులను ఇంటింటికీ అందించాలని చెప్పారు.
క్షయ, కుష్ఠు వ్యాధుల నిర్మూలన కార్యక్రమాల్లో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని, క్షయ వ్యాధి బాధితులకు క్రమం తప్పకుండా మందులు అందేలా చూడాలని ఆదేశించారు. డెంగ్యూ, మలేరియా వంటి కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రతిరోజూ క్షేత్రస్థాయి తనిఖీలు
అన్ని క్యాడర్ల పర్యవేక్షణ అధికారులు ప్రతిరోజూ తమ పరిధిలోని ఆరోగ్య ఉపకేంద్రాలు, పల్లె దవాఖానాలను సందర్శించి తనిఖీలు నిర్వహించాలని DM&HO ఆదేశించారు. ఏఎన్ఎం, ఆశా కార్యకర్తల రోజువారీ రిజిస్టర్లు, పోర్టల్లో నమోదు చేస్తున్న వివరాలను పరిశీలించి, వారి సమస్యలను పరిష్కరిస్తూ తగిన మార్గదర్శనం చేయాలని చెప్పారు.
వైద్యులు, ఆరోగ్య సిబ్బంది బయోమెట్రిక్ హాజరు నమోదు చేయడంతో పాటు నిర్దేశిత సమయాల్లో ఆసుపత్రుల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.
జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని డాక్టర్ జె. వెంకటి హెచ్చరించారు.













