ఇందిరమ్మ కుటుంబ బీమా పథకానికి కామారెడ్డిలో ప్రత్యేక శిబిరాలు
రేషన్ కార్డు లేని కుటుంబాలకూ అవకాశం.. బీమా నమోదు తేదీలు ఖరారు
ఇవి కూడా చదవండి
పవార్ వార్త, కామారెడ్డి: అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియ నవంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. డిసెంబర్ 18 వరకు గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల వారీగా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి లబ్ధిదారుల వివరాలు నమోదు చేయనున్నారు. జిల్లాలోని అర్హ కుటుంబాలు ఈ గడువులో తమ వివరాలను నమోదు చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు.
ఎవరికి అర్హత? ఎంత బీమా రక్షణ?
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఈ పథకం కింద ప్రతి అర్హ కుటుంబం నుంచి 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఒకరికి మాత్రమే రూ.5 లక్షల జీవిత బీమా వర్తిస్తుంది. ఆధార్ కార్డులో నమోదైన పుట్టిన తేదీ ఆధారంగా అర్హతను నిర్ధారిస్తారు.
1967 నవంబర్ 19 నుంచి 2008 నవంబర్ 18 మధ్య జన్మించిన వారు ఈ పథకానికి అర్హులని కలెక్టర్ వివరించారు. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే బీమా వర్తిస్తుందని స్పష్టం చేశారు.
25 మండలాలు, 532 గ్రామ పంచాయతీల్లో శిబిరాలు
కామారెడ్డి జిల్లాలోని 25 మండలాల పరిధిలో ఉన్న 532 గ్రామ పంచాయతీలతో పాటు ఎల్లారెడ్డి, బిచ్కుంద, బాన్సువాడ, కామారెడ్డి మున్సిపాలిటీల్లోని ప్రతి వార్డులో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు.
నవంబర్ 19 నుంచి డిసెంబర్ 18 వరకు సెలవు దినాలు మినహా ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శిబిరాలు నిర్వహిస్తారు. అర్హ కుటుంబాలన్నీ నమోదు చేసుకునేలా గ్రామాలు, పట్టణాల్లో ప్రచారం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
రేషన్ కార్డు, ఆధార్ వివరాలు తప్పనిసరి
ఈ పథకం దరఖాస్తుకు రేషన్ కార్డు నంబరునే నమోదు సంఖ్యగా పరిగణిస్తారు. రేషన్ కార్డు లేని కుటుంబాలకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రత్యేక కోడ్ ఆధారంగా గుర్తింపు సంఖ్య కేటాయించి నమోదు చేస్తారు. రేషన్ కార్డులో ఈ-కేవైసీ పెండింగ్‌లో ఉన్న కుటుంబాలు సంబంధిత రేషన్ దుకాణంలో వెంటనే పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.
బీమా పొందే వ్యక్తి స్వయంగా శిబిరానికి హాజరై తన వివరాలు, నామినీల వివరాలు అందించాలి. దరఖాస్తుపై స్వయంగా సంతకం చేయడం తప్పనిసరి. ఇతరుల ద్వారా తీసుకొచ్చిన దరఖాస్తులను, వేరే చోట సంతకం చేసిన దరఖాస్తులను స్వీకరించరాదని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు.
దరఖాస్తుదారుడు ఆధార్ కార్డు ప్రతితో పాటు మొబైల్ నంబరును అందించాలి. ఒకరి కంటే ఎక్కువ మంది నామినీలను పేర్కొంటే ప్రతి ఒక్కరికి కేటాయించే వాటాను స్పష్టంగా నమోదు చేయాలి. సంతకం తీసుకునే ముందే నామినీ వివరాలు, వాటాల వివరాలను దరఖాస్తుదారునికి చదివి వివరించాలని కలెక్టర్ సూచించారు.
అధికారులకు కలెక్టర్ ఆదేశాలు
మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మండల ప్రత్యేక అధికారులు, మండల గణాంక అధికారులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పథకం విధివిధానాలు, ఆన్లైన్ నమోదు ప్రక్రియపై కలెక్టర్ అవగాహన కల్పించారు.
జిల్లాలో అర్హులైన కుటుంబాలన్నింటినీ గుర్తించి ఎవరూ మిగిలిపోకుండా నమోదు చేయాలని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో సీపీఓ రఘునందన్, డీఆర్డీఓ దామోదర్ రెడ్డి, సీఈఓ చందర్, ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి, డీఎస్ఓ వెంకటేష్, డీఎం శ్రీకాంత్ తదితర అధికారులు పాల్గొన్నారు.















