కుక్క కాటు ఘటనల నివారణకు జిల్లా కమిటీలు.. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కీలక ఆదేశాలు

ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో కుక్కల నివారణకు ప్రత్యేక చర్యలు

పవార్ వార్త, కామారెడ్డి: వీధి కుక్కల నియంత్రణకు జిల్లాలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం 2 ఎకరాల స్థలాన్ని గుర్తించి జంతు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. కుక్క కాటు ఘటనలను నివారించడంతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ప్రాంగణాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటు
వీధి కుక్కల నిర్వహణ, కుక్క కాటు ఘటనల నివారణ కోసం కామారెడ్డి జిల్లాలో రెండు జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి రహదారులు, జాతీయ రహదారుల కమిటీతో పాటు జిల్లా స్థాయి సంస్థల ప్రాంగణాల భద్రతా కమిటీలను ఏర్పాటు చేశారు.
ఈ కమిటీల తొలి సమావేశాన్ని నవంబర్ 28న ఉదయం 11 గంటలకు నిర్వహించారు. సమావేశంలో జిల్లా ఎస్పీతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. వీధి కుక్కల సమస్యను నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలు, వివిధ శాఖలకు అప్పగించాల్సిన బాధ్యతలపై సమావేశంలో చర్చించారు.
2 ఎకరాల్లో జంతు సంరక్షణ కేంద్రం
జిల్లాలో వీధి కుక్కల నిర్వహణ కోసం ప్రత్యేక జంతు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఇందుకోసం 2 ఎకరాల స్థలాన్ని గుర్తించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అలాగే అన్ని శాఖల అధికారులు తమ పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను గుర్తించాలి. ప్రతి సంస్థకు ఒక నోడల్ అధికారిని నియమించి, అక్కడి పరిస్థితులను పర్యవేక్షించాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో ఫెన్సింగ్, ప్రహరీ గోడలు, గేట్లు ఏర్పాటు చేసి కుక్కలు సంస్థల ప్రాంగణాల్లోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో రేబిస్ టీకాలు తప్పనిసరి
కుక్క కాటు బాధితులకు సకాలంలో వైద్యం అందించేందుకు అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో యాంటీ రేబిస్ వ్యాక్సిన్ (ARV), రేబిస్ ఇమ్యునోగ్లోబులిన్ (RIG) నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు.
ఈ మందుల కొరత లేకుండా పర్యవేక్షించాలని సూచించారు. వీధి కుక్కల నిర్వహణ, కుక్క కాటు నివారణకు సంబంధించి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి తమకు కేటాయించిన బాధ్యతలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
సమావేశంలో జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ ఎం. భరత్, సహాయ సంచాలకులు డాక్టర్ దేవేందర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ మోనికా తదితరులు పాల్గొన్నారు.

0 మంది ఇష్టపడ్డారు
షేర్
డౌన్‌లోడ్న్యూస్ పేపర్ క్లిప్పింగ్ • హై క్వాలిటీ

మరిన్ని వార్తలు

వ్యాఖ్యానించండి