నిజాం కాలం చరిత్ర కలిగిన బీబీపేటకు నియోజకవర్గ హోదా కల్పించాలి
అభివృద్ధికి దూరంగా బీబీపేట.. ప్రత్యేక నియోజకవర్గం ఏర్పాటు చేయాలని డిమాండ్
ఇవి కూడా చదవండి
పవార్ వార్త, బీబీపేట: కామారెడ్డి జిల్లాలోని బీబీపేట మండలాన్ని ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని కొరివి నర్సింహులు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో కొత్త నియోజకవర్గాల ఏర్పాటు అంశాన్ని పరిశీలించే సమయంలో బీబీపేటకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చారిత్రక నేపథ్యం, భౌగోళిక పరిస్థితులు, అభివృద్ధి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.
కొరివి నర్సింహులు మాట్లాడుతూ.. బీబీపేటకు నిజాం కాలం నుంచే ప్రత్యేక చరిత్ర ఉందని పేర్కొన్నారు. గతంలో ఇక్కడ తమలపాకుల తోటలు ఉండేవని, గొలుసుకట్టు చెరువుల వ్యవస్థతో పాటు ఒక టీఎంసీ నీటి సామర్థ్యం కలిగిన చెరువు కూడా ఉండేదని తెలిపారు. నిజాం పాలన సమయంలో బీబీపేటలో పోలీస్‌స్టేషన్ ఉండేదని, అప్పట్లోనే గూడల అంగడి వంటి వ్యాపార కార్యకలాపాలు జరిగేవని వివరించారు.
బీబీపేట భౌగోళిక పరిస్థితులను పరిశీలించాలి
బీబీపేట ప్రాంతం చుట్టుపక్కల జిల్లాలు, పట్టణాలకు సమీపంలో ఉన్నప్పటికీ అభివృద్ధి పరంగా వెనుకబడిందని నర్సింహులు అభిప్రాయపడ్డారు. సిద్దిపేట, దుబ్బాక, మెదక్, సిరిసిల్ల, కామారెడ్డి ప్రాంతాలకు రవాణా పరంగా అనుసంధానం ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాంతాల మధ్య దూరాలను పరిగణనలోకి తీసుకుని బీబీపేట భౌగోళిక పరిస్థితులపై ప్రభుత్వం సమగ్ర సర్వే నిర్వహించాలని కోరారు.
అన్ని పార్టీలూ మద్దతివ్వాలి
రాష్ట్రంలో కొత్త నియోజకవర్గాల ఏర్పాటు అంశం తెరపైకి వచ్చినప్పుడు జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ బీబీపేటకు ప్రత్యేక నియోజకవర్గ హోదా కల్పించే అంశానికి మద్దతు ఇవ్వాలని నర్సింహులు విజ్ఞప్తి చేశారు. గ్రామానికి ఉన్న చారిత్రక గుర్తింపును కాపాడటంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని కోరారు.
కొరివి నర్సింహులు ముదిరాజ్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ భర్త అయిన ఆయన బీబీపేట మండలానికి ప్రత్యేక నియోజకవర్గ హోదా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.












