విద్యా వాలంటీర్లు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే మార్గదర్శకులు: ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్‌నగర్ నగరం, సెప్టెంబర్ 4: విద్యా వాలంటీర్లు కేవలం పాఠాలు బోధించేవారిగా కాకుండా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే మార్గదర్శకులుగా పనిచేయాలని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ ఫస్ట్ శిక్షణా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని 100 ప్రభుత్వ పాఠశాలల్లో సేవలందించేందుకు ఎంపికైన 100 మంది విద్యా వాలంటీర్లకు తన సొంత నిధులతో మొదటి నెల గౌరవ వేతనంగా ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.10 లక్షలను అందజేశారు.
ఈ సందర్భంగా యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు అకడమిక్స్‌తో పాటు నైతిక విలువలు, మంచి ఆలోచనా విధానం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించేలా విద్యా వాలంటీర్లు కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి, ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారో తెలుసుకుని ప్రత్యేకంగా మార్గనిర్దేశనం చేయాలన్నారు.
చదువును మధ్యలోనే నిలిపివేయాలనుకునే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవసరమైన కౌన్సెలింగ్ ఇచ్చి పిల్లల భవిష్యత్తుపై నమ్మకం కల్పించాలని సూచించారు. క్రీడలు, కళలు, ఇతర రంగాల్లో ప్రతిభ ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించాలని అన్నారు.
‘శతశాతం’ కార్యక్రమాన్ని విజయవంతమైన మోడల్‌గా తీర్చిదిద్దాలి
మహబూబ్‌నగర్ ఫస్ట్, వందేమాతరం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో చేపడుతున్న ‘శతశాతం’ కార్యక్రమాన్ని విజయవంతమైన మోడల్‌గా తీర్చిదిద్ది రాష్ట్రానికి ఆదర్శంగా నిలపాలన్నదే తన లక్ష్యమని యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి విద్యా సహాయక కార్యక్రమాలకు నాంది పలకాలని ఆకాంక్షించారు.
భవిష్యత్తులో విద్యార్థుల అభ్యాస పురోగతిని శాస్త్రీయంగా అంచనా వేసేందుకు డిజిటల్ డేటా, ట్యాబ్లెట్లను వినియోగించే దిశగా చర్యలు చేపడతామని చెప్పారు. విద్యార్థుల చదువుపై ఇంటి వాతావరణం కూడా ప్రభావం చూపుతుందని, అవసరమైన సందర్భాల్లో తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేలా అవగాహన కల్పించాలని అన్నారు.
‘శతశాతం’ కార్యక్రమం వెనుక సుమారు 50–60 మంది శ్రమ, సమయం, ఆర్థిక సహకారం ఉందని, ఇది కేవలం ఒక కార్యక్రమం కాదని, సమాజానికి చేస్తున్న సేవ అని ఆయన పేర్కొన్నారు. విద్యా వాలంటీర్లు ఈ బాధ్యతను ఉద్యోగంగా కాకుండా సేవా భావంతో స్వీకరించి, ప్రతి విద్యార్థి జీవితంలో మంచి మార్పు తీసుకురావాలని పిలుపునిచ్చారు.
ప్రతి పిల్లవాడికి మంచి విద్య, మంచి ఆలోచన, మంచి భవిష్యత్తు అందించడమే ‘శతశాతం’ లక్ష్యమని స్పష్టం చేశారు. విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో విద్యా వాలంటీర్లు ప్రతి ఒక్కరూ సఫలీకృతం కావాలని ఆకాంక్షించారు.
ఈ నెల లేదా వచ్చే నెలలో క్యూఆర్ కోడ్ డిజిటల్ బుక్స్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అంతకుముందు గత నెల రోజులుగా పాఠశాలల్లో విద్యా వాలంటీర్లు నిర్వహించిన కార్యక్రమాలపై ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్.పి. వెంకటేష్, మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, వందేమాతరం ఫౌండేషన్ కోఆర్డినేటర్ రవీందర్ రెడ్డి, విద్యా వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.