జాతీయ స్థాయి కరాటే పోటీల్లో బీబీపేట విద్యార్థి వంశీకి రెండు బంగారు పతకాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 8న నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో తెలంగాణలోని బీబీపేటకు చెందిన విద్యార్థి చిట్టబోయిన వంశీ ముదిరాజ్ రెండు బంగారు పతకాలు సాధించారు. ‘ఒకినవా గోజుర్యు కరాటే అకాడమీ’కి ప్రాతినిధ్యం వహించిన వంశీ ఈ విజయంతో గ్రామానికి గర్వకారణంగా నిలిచారని నిర్వాహకులు తెలిపారు.
వంశీకి శిక్షణ అందించిన మాస్టర్లు గునోళ్ల కుమార్, కమిండ్ల నవీన్, సంతోష్, లక్ష్మీనర్సులకు గ్రామ పెద్దలు అభినందనలు తెలిపారు. తాజా మాజీ ఎంపీటీసీ నీరజ భర్త కొరివి నరసింహులు వంశీతో పాటు శిక్షకులను సన్మానించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కొరివి నరసింహులు మాట్లాడుతూ కరాటే పోటీల్లో వంశీ రెండు బంగారు పతకాలు సాధించడం ఆనందంగా ఉందని అన్నారు. బీబీపేట నుంచి మరింత మంది విద్యార్థులు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు.
విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న క్రీడలను ఎంచుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన కోరారు. క్రీడల్లో ప్రతిభ చూపుతున్న విద్యార్థులను ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించాలని కోరారు.
వ్యవసాయం చేస్తూనే పిల్లలను చదివిస్తూ వారి అభివృద్ధి కోసం తల్లిదండ్రులు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు రావాలని నరసింహులు పేర్కొన్నారు. ఇలాంటి విజయాలు సాధిస్తున్న విద్యార్థులను చూసి ఇతర తల్లిదండ్రులు, పిల్లలు కూడా స్ఫూర్తి పొందాలని అన్నారు.
వంశీ సాధించిన విజయంపై ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.