గణేష్ మండపాల నిర్వాహకులకు కామారెడ్డి పోలీసుల కీలక సూచనలు.. ఆన్‌లైన్ ఇంటిమేషన్ తప్పనిసరి
కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ గణేష్ మండపాల నిర్వాహకులకు పలు సూచనలు జారీ చేసింది. భద్రత, బందోబస్తు ఏర్పాట్ల కోసం గణేష్ మండపాల వివరాలను పోలీస్ శాఖ రూపొందించిన పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఇంటిమేషన్ నమోదు చేసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ తెలిపారు.
సెప్టెంబర్ 8న విడుదల చేసిన పత్రికా ప్రకటనలో.. గణేష్ మండపాల ఆన్‌లైన్ ఇంటిమేషన్ విధానం కేవలం మండపం నిర్వహణకు సంబంధించిన వివరాలను ముందస్తుగా పోలీస్ శాఖకు తెలియజేయడం కోసం మాత్రమే రూపొందించిందని ఎస్పీ తెలిపారు. ఈ వివరాల ఆధారంగా మండపాల వద్ద భద్రత, బందోబస్తు ఏర్పాట్లు చేయడం పోలీసులకు సులభతరం అవుతుందని పేర్కొన్నారు.
మండపాల వివరాల ఆన్‌లైన్ ఇంటిమేషన్ నమోదుకు ఎలాంటి రుసుము లేదని తెలిపారు. విగ్రహాలను ఏర్పాటు చేసే ముందు కంప్యూటర్ లేదా మొబైల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని పోలీస్ శాఖకు ముందస్తు సమాచారం అందించాలని గణేష్ ఉత్సవ నిర్వాహకులకు సూచించారు.
మండపానికి సంబంధించిన వివరాలను policeportal.tspolice.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసి, దరఖాస్తును సంబంధిత పోలీస్ స్టేషన్‌కు అందించాలని సూచించారు.
గణేష్ మండపాల నిర్వాహకులు పాటించాల్సిన సూచనలు
- భద్రత, బందోబస్తు కోసమే గణేష్ ఆన్‌లైన్ ఇంటిమేషన్ నమోదు విధానం. గణేష్ మండప నిర్వాహకులు పోలీసు శాఖ రూపొందించిన పోర్టల్ ద్వారా వివరాలను నమోదు చేసుకుని పోలీసు శాఖకు సహకరించాలి.
- గణేష్ మండపాలను ప్రజా రవాణాకు, అత్యవసర వాహనాలు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి.
- మండపాలు ఏర్పాటు చేసేవారు సంబంధిత శాఖల అనుమతులు, విద్యుత్ శాఖ అనుమతి పత్రంతోనే విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలి.
- మండపాల పూర్తి బాధ్యత నిర్వాహకులదే. ప్రతి మండపం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.
- మండప కమిటీ వివరాలు, మండపం బాధ్యత వహించే నిర్వాహకుల పేర్లు, ఫోన్ నంబర్లను మండపం వద్ద స్పష్టంగా ప్రదర్శించాలి.
- గణేష్ మండపాల వద్ద 24 గంటలు కనీసం నలుగురు వాలంటీర్లు ఉండేలా నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలి.
- గణేష్ ప్రతిమను ఏర్పాటు చేసే ప్రదేశంలో షెడ్డును నాణ్యతతో నిర్మించాలి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తగా ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, నీటితో కూడిన డ్రమ్ములు, ఇసుకను అందుబాటులో ఉంచుకోవాలి.
- గణేష్ మండపాలకు వచ్చే భక్తుల సందర్శనను దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో పాటు తగిన సంఖ్యలో వాలంటీర్లను నియమించాలి.
- మండపాల్లో, శోభాయాత్రలో ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలను ఏర్పాటు చేయరాదు.
- విద్యాసంస్థలు, ఆసుపత్రులు, ప్రార్థనా మందిరాలు, వృద్ధులు, చిన్నపిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చిన్న స్పీకర్లను పోలీసు శాఖ అనుమతితో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. మండపాల వద్ద భక్తి గీతాలు మాత్రమే ప్లే చేయాలి.
- సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలి.
- మండపాల వద్ద మద్యం సేవించడం, జూదం ఆడటం, అసభ్యకర నృత్యాలు నిర్వహించడం, ఇతరులను కించపరిచే విధంగా ప్రసంగాలు లేదా పాటలు ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధం.
- ఇతరుల మనోభావాలను కించపరిచే విధంగా మండపాల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధం.
- మండపాల వద్ద ఏదైనా అనుమానాస్పద బ్యాగులు, వస్తువులు లేదా వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే డయల్ 112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి.
- మండపాల వద్ద నిర్వహించే సాంస్కృతిక, ఇతర కార్యక్రమాల వివరాలను పోలీసులకు ముందుగానే తెలియజేయాలి. తద్వారా అవసరమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
- గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపన రోజున నిర్ణీత సమయానికి విగ్రహాలను మండపానికి చేరుకునే విధంగా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలి.
- మధ్యాహ్నం నుంచే గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించి, నిర్దేశించిన సమయానికి నిమజ్జనం పూర్తయ్యే విధంగా మండప నిర్వాహకులు పోలీసులకు సహకరించాలి.
- గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపన, నిమజ్జనం రోజుల్లో నిర్వాహకులు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా శోభాయాత్ర నిర్వహించాలి.
- గణేష్ శోభాయాత్ర సమయంలో ఇతరులపై రంగులు చల్లకూడదు.
- శోభాయాత్ర సమయంలో ఇతరులను కించపరిచే విధంగా నినాదాలు చేయకూడదు.
- శోభాయాత్ర సమయంలో టపాసులు పేల్చడం పూర్తిగా నిషేధం.
- సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఎలాంటి రూమర్లు, వదంతులను నమ్మకూడదు. ఏదైనా సందేహం ఉంటే సంబంధిత పోలీసులకు లేదా డయల్ 112కు సమాచారం అందించాలి.
- మహిళల రక్షణకు మొదటి ప్రాధాన్యతనిచ్చే పోలీసు శాఖ.. గణేష్ మండపాల వద్ద లేదా శోభాయాత్రలో మహిళలు, పిల్లలకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది.
- గణేష్ శోభాయాత్రకు ఉపయోగించే వాహనాలు మంచి కండిషన్‌లో ఉండాలి. డ్రైవర్‌కు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు ఉండాలి.
- గణేష్ మండపాల వద్ద పాయింట్ బుక్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఉదయం, సాయంత్రం, రాత్రి సమయాల్లో పోలీసు శాఖ సిబ్బంది మండపాలను పర్యవేక్షిస్తారు. వారికి నిర్వాహకులు సహకరించాలి.
- పోలీసు శాఖ సూచించిన నియమ నిబంధనలను పాటిస్తూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖకు నిర్వాహకులు పూర్తిగా సహకరించాలి.
గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ పోలీస్ శాఖకు నిర్వాహకులు సహకరించాలని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర సూచించారు.