గాంధారిలో అక్రమ గంజాయి సాగు భగ్నం.. 400 గంజాయి మొక్కలు స్వాధీనం
కామారెడ్డి జిల్లా గాంధారి మండల శివారులో అక్రమంగా సాగు చేస్తున్నట్లు గుర్తించిన గంజాయి పంటను పోలీసులు భగ్నం చేశారు. పత్తి పంటలో అంతర పంటగా గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. గాంధారి శివారులోని తుమ్మల ప్రాంతంలోని వ్యవసాయ భూమిలో పత్తి పంట మధ్య గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో సుమారు 400 పచ్చి గంజాయి మొక్కలను వేర్లతో సహా తొలగించి స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారి పరిశీలనలో అవి గంజాయి మొక్కలుగా నిర్ధారించినట్లు పోలీసులు తెలిపారు.
మూడు భూముల్లో సాగు
పోలీసుల దర్యాప్తులో మంజ సోనుసింగ్, మంజ మద్దిబాయి ఇద్దరూ భార్యాభర్తలుగా గుర్తించినట్లు తెలిపారు. వీరు గాంధారి గ్రామానికి చెందిన లక్ష్మికి సంబంధించిన సర్వే నంబర్ 110/ఆ 2/2లోని 3 ఎకరాల 26 గుంటల భూమిని కౌలుకు తీసుకుని, పత్తి పంటతో పాటు సుమారు 250 గంజాయి మొక్కలను సాగు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అదేవిధంగా బస్సి జోద్రాజ్ అనే వ్యక్తి గాంధారి గ్రామానికి చెందిన నారాయణకు సంబంధించిన సర్వే నంబర్ 110/అలోని 1 ఎకరం 20 గుంటల భూమిని కౌలుకు తీసుకుని, పత్తి పంట మధ్య సుమారు 150 గంజాయి మొక్కలను సాగు చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
మొత్తంగా మూడు వ్యవసాయ భూముల్లో సుమారు 400 గంజాయి మొక్కలు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్కల మార్కెట్ విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.
ముగ్గురు అదుపులోకి.. సెల్‌ఫోన్లు స్వాధీనం
గంజాయి సాగు వ్యవహారంలో మంజ సోనుసింగ్, మంజ మద్దిబాయి, బస్సి జోద్రాజ్‌లను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి సాగుకు సంబంధించి వీరి మధ్య జరిగిన సంభాషణలకు ఉపయోగించిన మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అధిక డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పత్తి పంటలో గంజాయిని అంతర పంటగా సాగు చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
అయితే గంజాయి సాగుకు విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇతర వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా, సాగు చేసిన గంజాయిని ఎక్కడికి తరలించేందుకు ప్రయత్నించారు అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అక్రమ గంజాయి సాగుపై కఠిన చర్యలు
గంజాయి వంటి నిషేధిత మాదకద్రవ్యాల సాగు, రవాణా, విక్రయం, వినియోగానికి పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా సదాశివనగర్ సీఐ చౌదరి వీరయ్య, గాంధారి ఎస్సై మహేందర్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నట్లు సమాచారం.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.