దివ్యాంగులకు రూ.4,016.. ఇతరులకు రూ.2,016 పింఛన్.. 790 మందికి మంజూరు పత్రాలు

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. అర్హులందరికీ పథకాలు: డా. భూపతి రెడ్డి

పవార్ వార్త, డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలంలో కొత్తగా 790 మందికి చేయూత పింఛన్లు మంజూరయ్యాయి. వీరిలో 230 మంది దివ్యాంగులు ఉండగా, వారికి నెలకు రూ.4,016, మిగతా అర్హులైన లబ్ధిదారులకు రూ.2,016 చొప్పున ప్రభుత్వం పింఛన్ అందించనుంది. మంగళవారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు.
790 మందికి పింఛన్ల మంజూరు
మండలంలో కొత్తగా పింఛన్లు పొందిన వారిలో 435 మంది వితంతువులు, 96 మంది ఒంటరి మహిళలు, 230 మంది దివ్యాంగులు, 28 మంది గీత కార్మికులు, ఒకరు చేనేత కార్మికుడు ఉన్నట్లు ఎమ్మెల్యే వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకు అతీతంగా, ఎలాంటి పైరవీలకు తావులేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఆయన చెప్పారు.
జిల్లా వ్యాప్తంగా 20 వేల మందికి పైగా కొత్త లబ్ధిదారులకు పింఛన్లు మంజూరయ్యాయని, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 3 వేల మందికి పైగా కొత్తగా పింఛన్లు అందనున్నాయని తెలిపారు. మంజూరులో ఆలస్యం జరిగినా అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందిస్తామని భరోసా ఇచ్చారు.
మహిళలు, పేద కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి వడ్డీలేని రుణాలు అందిస్తోందని భూపతి రెడ్డి పేర్కొన్నారు. మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో స్వయం సహాయక సంఘాలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 150కి పైగా మహిళా సంఘ భవనాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. మహిళా సంఘాలు బస్సులను అద్దెకు తీసుకుని నెలకు రూ.70 వేల వరకు ఆదాయం పొందే అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు.
మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, పేద కుటుంబాలకు రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఈ నెల 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు.
రూరల్ నియోజకవర్గంలో 6 వేల ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యం
పేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే 3,500 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, రెండో విడతలో మరో 2,500 ఇళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తంగా 6 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, నియోజకవర్గాన్ని గుడిసెలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దడమే తన ఆశయమని పేర్కొన్నారు.
రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం
రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ప్రతి గింజను కొనుగోలు చేస్తామని భూపతి రెడ్డి హామీ ఇచ్చారు. మరో రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. క్వింటాల్ ధాన్యాన్ని రూ.3 వేల కంటే తక్కువకు విక్రయించవద్దని రైతులకు సూచించారు.
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో భూగర్భ జలాలను పొదుపుగా వినియోగించుకోవాలని, రెండో పంటగా వరికి బదులుగా ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించేందుకు ఉపాధి హామీ పనిదినాలను 100 నుంచి 150 రోజులకు పెంచినట్లు వివరించారు.
విద్యా రంగంలో భాగంగా మల్కాపూర్‌లో సుమారు రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తున్నామని, తెలంగాణ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, మాజీ ఐసీడీఎంఎస్ చైర్మన్ సాయారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు, పింఛన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.

0 మంది ఇష్టపడ్డారు
షేర్
డౌన్‌లోడ్న్యూస్ పేపర్ క్లిప్పింగ్ • హై క్వాలిటీ

మరిన్ని వార్తలు

వ్యాఖ్యానించండి