డంపింగ్ యార్డు పొగలు, మురికి నీటి నురుగును వెంటనే నివారించాలి
కీసర సర్కిల్, జవహర్‌నగర్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని కార్మికనగర్ వాసులు ఎదుర్కొంటున్న పొగలు, మురికి నీటి నురుగు సమస్యను వెంటనే పరిష్కరించాలని డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్ షావలి, కన్వీనర్ ఉమామహేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వారు పలు ఆరోపణలు, డిమాండ్లు చేశారు.
గత రెండు రోజులుగా కార్మికనగర్‌లో పట్టపగలే చీకట్లను తలపించేలా పొగలు కమ్ముకుంటున్నాయని, మురికి నీటి నురుగులు పెద్దఎత్తున బుడగలుగా మారి గాలిలో తేలుతూ ఇళ్లలోకి చేరుతున్నాయని వారు పేర్కొన్నారు. ఆ నురుగులు పగిలినప్పుడు భరించలేని దుర్వాసనతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
భరించలేని దుర్గంధంతో కూడిన పొగలు, మురికి నీటి నురుగుల కారణంగా కళ్లపై ప్రభావం పడి, కంటిచూపు మందగించిందని షేక్ షావలి, ఉమామహేష్ పేర్కొన్నారు. గతంలోనూ దుర్వాసనలు వెదజల్లే బురదతో కూడిన మురికి నీటి పైపులైన్‌ను అర్ధరాత్రి సమయంలో ధ్వంసం చేసి కార్మికనగర్ వాసులపై వదిలారని వారు ఆరోపించారు.
డంపింగ్ యార్డు విస్తరణ కోసం మరింత భూమిని పొందేందుకు కార్మికనగర్‌లోని నివాస ప్రజలను బలవంతంగా తరలించేందుకు రాంకీ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోందని వారు ఆరోపించారు. ఈ చర్యలను దుర్మార్గమైనవి, అమానుషమైనవిగా పేర్కొంటూ ఖండించారు.
రాంకీ యాజమాన్యం ఇప్పటికైనా తమ పద్ధతులను మార్చుకోవాలని, కార్మికనగర్ వాసులు, పిల్లలు, వృద్ధులు శ్వాసకోశ వ్యాధులకు గురికాకుండా ఆరోగ్య భద్రతలో భాగంగా మంచినీటి సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు.
తమ డిమాండ్లను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఆందోళన చేపట్టాల్సి వస్తుందని షేక్ షావలి, ఉమామహేష్ హెచ్చరించారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.