హెల్మెట్ లేని వాహనదారులకు గులాబీలతో అవగాహన
ప్రాణాల కంటే ప్రయాణం ముఖ్యం కాదు.. వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల సూచన
ఇవి కూడా చదవండి
పవార్ వార్త, కామారెడ్డి: రోడ్డు ప్రమాదాలను నివారించి వాహనదారుల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచేందుకు హైదరాబాద్కు చెందిన రోడ్ వారియర్ తెలంగాణ మిషన్ ప్రతినిధి అరుణ్ బత్తుల చేపట్టిన 33 జిల్లాల యాత్ర మంగళవారం కామారెడ్డికి చేరుకుంది. ఈ సందర్భంగా నిజాంసాగర్ చౌరస్తా వద్ద పట్టణ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు.
హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న వారిని ట్రాఫిక్ పోలీసులు ఆపి, వారికి మర్యాదపూర్వకంగా హెల్మెట్లు, గులాబీ పువ్వులు అందజేశారు. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఈ కార్యక్రమం ద్వారా సూచించారు.
పట్టణ ట్రాఫిక్ ఎస్సై చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రాణాల కంటే ప్రయాణం ముఖ్యం కాదని అన్నారు. వాహనంపై బయటకు వెళ్లిన ప్రతి ఒక్కరూ క్షేమంగా ఇంటికి చేరుకోవాలంటే ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం అలవాటు చేసుకోవాలని, నిర్లక్ష్యంగా ప్రయాణించడం వల్ల ప్రమాదాల ముప్పు పెరుగుతుందని వివరించారు.
రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు వాహనదారుడితో పాటు అతడిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అందువల్ల ప్రయాణ సమయంలో వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసులు సూచించారు.
33 జిల్లాల యాత్రలో భాగంగా అరుణ్ బత్తుల కామారెడ్డిలో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమం ద్వారా హెల్మెట్ ధరించడంపై వాహనదారులకు సందేశం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణానికి సహకరించాలని పట్టణ ట్రాఫిక్ ఎస్సై చంద్రశేఖర్ గౌడ్ కోరారు.













