సౌదీలో భర్త మృతి.. న్యాయం కోసం ప్రజావాణిని ఆశ్రయించిన ఇష్రత్ బేగం
కామారెడ్డి షేక్ సయీద్ కుటుంబానికి అండగా ఉంటాం: గద్వాల్ విజయలక్ష్మి
ఇవి కూడా చదవండి
పవార్ వార్త, కామారెడ్డి: సౌదీ అరేబియాలోని రియాద్ విమానాశ్రయంపై జరిగిన డ్రోన్ దాడిలో మృతిచెందిన కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన షేక్ సయీద్ కుటుంబానికి పరిహారం అందించాలని ఆయన భార్య ఇష్రత్ బేగం ప్రభుత్వాన్ని కోరారు. సౌదీ అరేబియా ప్రభుత్వం, సంబంధిత సంస్థలు, కంపెనీ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్పర్సన్, సీఎం ప్రజావాణి ఇన్చార్జి గద్వాల్ విజయలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
13 ఏళ్లుగా సౌదీలో ఉద్యోగం
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన షేక్ సయీద్ (40) గత 13 ఏళ్లుగా సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తున్నారు. రియాద్ విమానాశ్రయంలోని స్టార్‌బక్స్‌లో పనిచేస్తున్న ఆయన అక్టోబర్ 10న జరిగిన డ్రోన్ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ 3న మృతిచెందారు.
కుటుంబ సభ్యుల అంగీకారంతో నవంబర్ 4న రియాద్‌లోనే అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న సయీద్ మరణంతో ఆయన భార్య, వృద్ధ తల్లి, ముగ్గురు చిన్నపిల్లలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది.
పరిహారం కోసం ప్రజావాణిలో వినతి
ఈ నేపథ్యంలో ఇష్రత్ బేగం, సయీద్ సోదరుడు షేక్ రహమాన్ నవంబర్ 27న హైదరాబాద్‌లోని బేగంపేట ప్రజాభవన్‌లో నిర్వహించిన సీఎం ప్రవాసీ ప్రజావాణికి హాజరయ్యారు. అక్కడ గద్వాల్ విజయలక్ష్మికి వినతిపత్రం సమర్పించి కుటుంబానికి ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం ద్వారా సౌదీ అరేబియా ప్రభుత్వంతో, సంబంధిత శాఖలతో, సయీద్ పనిచేసిన కంపెనీ యాజమాన్యంతో సంప్రదింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు. సౌదీ అరేబియా సామాజిక బీమా సంస్థ (గోసి) ద్వారా లభించే మరణ పరిహారం, బీమా ప్రయోజనాలు, ఇతర అర్హతగల ఆర్థిక ప్రయోజనాలను కుటుంబానికి అందించాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తామని హామీ
ఇష్రత్ బేగం వినతిపై గద్వాల్ విజయలక్ష్మి సానుకూలంగా స్పందించారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (జీఏడీ) ఎన్నారై విభాగం అధికారులతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, సీఎం ప్రవాసీ ప్రజావాణి వాలంటీర్లు గంగుల మురళీధర్ రెడ్డి, కర్రి పద్మారాణి పాల్గొన్నారు. ఇదే డ్రోన్ దాడి ఘటనలో హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ యూసుఫ్ అలీ కూడా మృతిచెందినట్లు సమాచారం.
















