విద్యార్థుల భద్రతకు ప్రత్యేక తనిఖీలు.. ఆటోల్లో పరిమితికి మించి పిల్లలు

స్కూల్ ఆటోల్లో ఆరుగురు పిల్లలకే అనుమతి.. తల్లిదండ్రులకు రవాణా శాఖ సూచనలు

పవార్ వార్త, కామారెడ్డి:  విద్యార్థులను పరిమితికి మించి ఎక్కించుకుని ప్రయాణిస్తున్న స్కూల్ ఆటోలపై కామారెడ్డి రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా పిల్లలను తరలిస్తున్న పలు వాహనాలను గుర్తించి, గత మూడు రోజులుగా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లా రవాణా అధికారి సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు సహాయక మోటార్ వెహికిల్స్ ఇన్‌స్పెక్టర్లు ఉదయ్ కుమార్, కృష్ణ తేజ ఈ తనిఖీలు నిర్వహించారు. కామారెడ్డి ప్రాంతంలో విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటోలను పరిశీలించి, అనుమతించిన పరిమితికి మించి పిల్లలను ఎక్కించిన వాహనాలను గుర్తించారు.
ఆటోల్లో పిల్లల సంఖ్యపై నిబంధనలు
మోటారు వాహన చట్టం ప్రకారం 4 సీట్ల ఆటో రిక్షాలో 12 సంవత్సరాల లోపు పిల్లలను గరిష్ఠంగా ఆరుగురిని మాత్రమే తీసుకెళ్లాలని రవాణా శాఖ అధికారులు సూచించారు. ఆటోల్లో విద్యార్థుల సంఖ్య పెరిగితే ప్రయాణ సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని, అందువల్ల వాహన సామర్థ్యానికి అనుగుణంగానే పిల్లలను తీసుకెళ్లాలని స్పష్టం చేశారు.
విద్యార్థుల స్కూల్ బ్యాగులు ఆటో బయటకు వేలాడకుండా లోపలే సర్దుబాటు చేయాలి. వాహనాలకు సేఫ్టీ గ్రిల్స్‌ను తప్పనిసరిగా అమర్చుకుని పిల్లలను సురక్షితంగా తీసుకెళ్లాలని సూచించారు.
తల్లిదండ్రులకు రవాణా శాఖ సూచనలు
పిల్లలను పాఠశాలకు పంపే సమయంలో వారు ప్రయాణిస్తున్న వాహనానికి అవసరమైన అనుమతులు ఉన్నాయా, వాహనంలో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కిస్తున్నారా అనే విషయాలను తల్లిదండ్రులు పరిశీలించాలని అధికారులు కోరారు.
విద్యార్థుల భద్రత ప్రతి ఒక్కరి సామూహిక బాధ్యత అని జిల్లా రవాణా అధికారులు పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లు రహదారి భద్రతా నియమాలను పాటిస్తూ రవాణా శాఖకు సహకరించాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

0 మంది ఇష్టపడ్డారు
షేర్
డౌన్‌లోడ్న్యూస్ పేపర్ క్లిప్పింగ్ • హై క్వాలిటీ

మరిన్ని వార్తలు

వ్యాఖ్యానించండి