ఖేలో ఇండియా పోటీలను ప్రత్యక్షంగా వీక్షించండి.. యువతకు మంత్రి వాకిటి శ్రీహరి సూచన

ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రచారానికి శాఖల సమన్వయం.. కామారెడ్డి కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్

పవార్ వార్త, కామారెడ్డి: తెలంగాణలో డిసెంబర్ 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించాలని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. జాతీయ స్థాయి క్రీడా పోటీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విద్యా, క్రీడా శాఖలతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
క్రీడా పోటీలను ప్రత్యక్షంగా వీక్షించాలి
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణ, ప్రచారం, ప్రజల భాగస్వామ్యంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడారు. పోటీలు జరిగే ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు, యువతీ యువకులు క్రీడా పోటీలను ప్రత్యక్షంగా వీక్షించాలని కోరారు.
క్రీడాకారులను ప్రోత్సహించడం ద్వారా యువతలో క్రీడలపై ఆసక్తి, క్రీడా స్ఫూర్తి పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. జాతీయ స్థాయి పోటీలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని పెంపొందించేందుకు అందరూ భాగస్వాములు కావాలని అన్నారు.
కామారెడ్డి జిల్లా అధికారుల భాగస్వామ్యం
వీడియో కాన్ఫరెన్స్‌లో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్.వై. గిరి, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.
వారితో పాటు జిల్లా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. వెంకట్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి సౌజన్య, జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణ, ప్రచార కార్యక్రమాల్లో సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు.

0 మంది ఇష్టపడ్డారు
షేర్
డౌన్‌లోడ్న్యూస్ పేపర్ క్లిప్పింగ్ • హై క్వాలిటీ

మరిన్ని వార్తలు

వ్యాఖ్యానించండి