టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ
ఆసిఫాబాద్, అక్టోబర్ 7: జోడేఘాట్ సాక్షిగా జల్–జంగల్–జమీన్ హక్కుల కోసం కొమురం భీం సాగించిన పోరాట స్ఫూర్తితో జర్నలిస్టులు తమ హక్కుల సాధన కోసం ఉద్యమించాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ పిలుపునిచ్చారు.
బుధవారం ఆసిఫాబాద్ పట్టణంలోని రోజ్ గార్డెన్స్ ఫంక్షన్ హాలులోని కొమురం భీం ప్రాంగణంలో టీయూడబ్ల్యూజే కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తృతీయ మహాసభ నిర్వహించారు. ఈ సభకు విశిష్ట అతిథిగా హాజరైన విరాహత్ అలీ మాట్లాడుతూ.. అణచివేతకు, అన్యాయానికి వ్యతిరేకంగా కొమురం భీం చేసిన పోరాటం జర్నలిస్టులకు స్ఫూర్తిదాయకమని అన్నారు.
ఆసిఫాబాద్ కేవలం అడవులకు మాత్రమే పరిమితమైన ప్రాంతం కాదని, ఆదివాసీ బిడ్డల ఆత్మగౌరవానికి చిరునామా అని విరాహత్ అలీ పేర్కొన్నారు. కొమురం భీం పోరాట వారసత్వాన్ని మోస్తున్న నేలగా ఆసిఫాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.
జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం టీయూడబ్ల్యూజే సుదీర్ఘకాలంగా పోరాటాలు నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులు పొందుతున్న పలు సౌకర్యాలు తమ సంఘం చేసిన పోరాటాల ఫలితంగానే వచ్చాయని పేర్కొన్నారు. తమ సంఘం ఏ రాజకీయ పార్టీకి, ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేయదని, జర్నలిస్టులు, మీడియా ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటాలు కొనసాగిస్తోందని అన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకపోవడం సరికాదని విరాహత్ అలీ అన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్ అమలు కాకపోవడంతో కొందరు అప్పులు చేసి వైద్యం పొందుతున్నారని, మరికొందరు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ఇళ్లు, ఇంటి స్థలాల హామీలను కూడా ప్రభుత్వం అమలు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ మాట్లాడుతూ ట్రేడ్ యూనియన్ నియమావళికి అనుగుణంగా సంస్థాగత నిర్మాణంతో రాష్ట్రంలో కొనసాగుతున్న జర్నలిస్టుల సంఘంగా టీయూడబ్ల్యూజే పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో వేలాది మంది జర్నలిస్టుల సభ్యత్వంతో సంఘం శాఖలు పనిచేస్తున్నాయని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేయడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
మహాసభలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రకాష్ రెడ్డి, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహ్మాన్, కార్యదర్శి సంపత్, యూనియన్ జిల్లా నాయకులు కృష్ణం రాజు, ప్రకాష్ గౌడ్, జమీల్, గిరిజా బాయి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి దాదాపు 250 మంది జర్నలిస్టులు మహాసభకు హాజరయ్యారు.
కథనాల్లో వాస్తవాలు ఉండాలి: కలెక్టర్ హరిత
ప్రజా సమస్యలపై జర్నలిస్టులు రాసే కథనాల్లో వాస్తవాలు ఉంటేనే వాటికి ప్రజల్లో విశ్వసనీయత లభిస్తుందని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత అన్నారు.
టీయూడబ్ల్యూజే జిల్లా మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికార యంత్రాంగంతో జర్నలిస్టులు సమన్వయంతో పనిచేస్తే సత్ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని అన్నారు. జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని ఆమె హామీ ఇచ్చారు.

133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.


