హైదరాబాద్/కామారెడ్డి: పెండింగ్‌లో ఉన్న డీఏల్లో రెండు విడతలకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయడంపై తెలంగాణ టీచర్స్ యూనియన్ (టిటియు) అభ్యంతరం వ్యక్తం చేసింది. సీపీఎస్ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ బకాయిలను దీర్ఘకాలిక వాయిదాల్లో కాకుండా మూడు వాయిదాల్లోనే చెల్లించాలని టిటియు రాష్ట్ర నాయకత్వం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో నంబర్ 128, 130 ప్రకారం డీఏ బకాయిలను వరుసగా 33 వాయిదాలు, 27 వాయిదాల్లో చెల్లించనున్నట్లు పేర్కొంది. మొదటి డీఏ బకాయిలను 33 నెలల్లో, రెండో డీఏ బకాయిలను 27 నెలల్లో చెల్లించే విధానం ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటుందని టిటియు నాయకులు పేర్కొన్నారు.
గతంలో ప్రకటించిన డీఏ బకాయిలను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడంలో ప్రభుత్వం జాప్యం చేసిందని, దీంతో ఉద్యోగుల్లో నిరాశ నెలకొందని వారు తెలిపారు. ప్రస్తుతం విడుదల చేసిన డీఏలకు సంబంధించిన బకాయిలను కూడా 27, 33 నెలల పాటు చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వడం సరైన విధానం కాదని టిటియు పక్షాన అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీర్ఘకాలిక వాయిదాల వల్ల సీపీఎస్ ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని టిటియు రాష్ట్ర అధ్యక్షులు మునగాల మణిపాల్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలంపెల్లి ఆదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల పరిస్థితులను ప్రభుత్వం సానుకూలంగా పరిగణనలోకి తీసుకుని డీఏ బకాయిలను మూడు వాయిదాల్లో వారి ఖాతాల్లో జమ చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఉదాహరణగా డీఎస్సీ-2008 టీచర్లకు సుమారు రూ.1.50 లక్షల పాత డీఏ బకాయిలు చెల్లించాల్సి ఉందని టిటియు నాయకులు తెలిపారు.
గతంలో డీఏ బకాయిలకు ప్రభుత్వం నిర్ణయించిన వాయిదాలు
టిటియు నాయకులు తెలిపిన వివరాల ప్రకారం గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్లో డీఏ బకాయిల చెల్లింపులకు వేర్వేరు సంఖ్యలో వాయిదాలు నిర్ణయించారు. వాటిలో జీవో నంబర్ 3లో 3 వాయిదాలు, జీవో నంబర్ 9లో 8 వాయిదాలు, జీవో నంబర్ 50లో 17 వాయిదాలు, జీవో నంబర్ 120లో 17 వాయిదాలు, జీవో నంబర్ 78లో 28 వాయిదాలు, జీవో నంబర్ 2లో 30 వాయిదాలు, జీవో నంబర్ 128లో 33 వాయిదాలు, జీవో నంబర్ 130లో 27 వాయిదాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో డీఏ బకాయిల చెల్లింపు కాలాన్ని తగ్గించి, ఉద్యోగులు మరియు పెన్షనర్లకు త్వరగా ప్రయోజనం కల్పించాలని టిటియు నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.


