ప్రజల సౌకర్యమే లక్ష్యంగా మార్కెట్ అభివృద్ధి: ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్‌నగర్ నగరంలోని 58వ డివిజన్ మార్కెట్‌లో రూ.5.02 కోట్లతో నిర్మించిన అధునాతన సమీకృత వెజ్–నాన్ వెజ్ మార్కెట్‌ను ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ప్రజలకు, వ్యాపారులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ మార్కెట్‌ను అభివృద్ధి చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
మార్కెట్ ప్రారంభోత్సవం అనంతరం యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నగర అభివృద్ధిలో ఈ రోజు ముఖ్యమైన రోజని అన్నారు. నగరంలోని ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల నూతన భవన నిర్మాణానికి రూ.20 కోట్లతో భూమిపూజ చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ కాలేజీ కాంప్లెక్స్ నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
మార్కెట్‌లో వ్యాపారులకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తామని ఆయన తెలిపారు. దుకాణాల అలైన్‌మెంట్, కేటాయింపులను త్వరలో పూర్తి చేసి ప్రతి ఒక్కరికీ అనుకూలంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వ్యాపారుల కోసం ప్రత్యేకంగా మంచినీటి ప్లాంట్, రిఫ్రిజిరేటర్, నీటి డబ్బాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో టాయిలెట్లు, విశ్రాంతి గదులు తదితర సౌకర్యాలను కూడా కల్పిస్తామని పేర్కొన్నారు.
వ్యాపారులకు ఇంకా ఏవైనా సదుపాయాలు అవసరమైతే వాటిని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తైబజార్‌ను రద్దు చేసినట్లు గుర్తు చేస్తూ, దీనివల్ల నగరంలోని వేలాది మంది చిన్న వ్యాపారులపై ఆర్థిక భారం తగ్గిందని అన్నారు.
తైబజార్ రద్దుతో వ్యాపారులు ప్రయోజనం పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. మార్కెట్ వెలుపల రోడ్డుపై వ్యాపారాలు నిర్వహించడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఇకపై ఎవరూ రోడ్డుపై కూర్చొని వ్యాపారం చేయరాదని స్పష్టం చేశారు. మార్కెట్‌లోనే వ్యాపారులకు అనువైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
రోడ్డు విస్తరణ, డ్రైనేజీని అండర్‌గ్రౌండ్‌లోకి మార్చడం, ఫ్లైఓవర్ నిర్మాణం వంటి చర్యలతో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. మార్కెట్‌లో వ్యాపారం నిర్వహించే ప్రతి ఒక్కరికీ బీమా సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కష్టనష్టాల్లో బీమా అండగా ఉంటుందని, వ్యాపారులందరూ బీమా చేయించుకునేలా అవగాహన కల్పించాలని కోరారు.
వ్యాపారులు తమ సమస్యలను స్థానిక కార్పొరేటర్, మేయర్, డిప్యూటీ మేయర్ దృష్టికి తీసుకురావాలని యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. తాను కూడా తరచూ మార్కెట్‌ను సందర్శించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నగర అభివృద్ధి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సూచించే నిబంధనలను వ్యాపారులు పాటించాలని కోరారు.
మార్కెట్ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించిన మున్సిపల్ అధికారులు, కమిషనర్, స్థానిక కార్పొరేటర్, మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, నాయకులు, సిబ్బందికి ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్.పి. వెంకటేష్, సిరాజ్ ఖాద్రీ, 58వ డివిజన్ కార్పొరేటర్ ఎం. అనురాధ చిన్నతో పాటు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, మున్సిపల్ కమిషనర్ రామాంజుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.