పెండింగ్ కేసుల దర్యాప్తులో జాప్యం వద్దు: మహబూబాబాద్ ఎస్పీ

ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి.. పోలీసులకు ఎస్పీ ఆదేశాలు

పవార్ వార్త, నర్సింహులపేట: గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను గుర్తించి ఛేదించాలని, గుడుంబా తయారీ, విక్రయాలపై నిరంతర నిఘా కొనసాగించాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ పోలీసు సిబ్బందిని ఆదేశించారు. శనివారం నర్సింహులపేట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఆయన పెండింగ్ కేసులు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు.
పెండింగ్ కేసుల దర్యాప్తుపై సమీక్ష
పోలీస్ స్టేషన్ పరిసరాలు, కార్యాలయ నిర్వహణ, రికార్డులను ఎస్పీ పరిశీలించారు. సిబ్బంది సంఖ్య, వారికి కేటాయించిన విధులు, ఎదురవుతున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్సై ఉపేందర్‌తో సమావేశమై స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలను సమీక్షించారు.
పెండింగ్, దర్యాప్తులో ఉన్న కేసులతో పాటు తీవ్రమైన, సాధారణ నేరాలకు సంబంధించిన కేసుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమైన కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. సాక్ష్యాధారాల సేకరణ, సాక్షుల వాంగ్మూలాలు, కేసు రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు.
డిజిటల్ పోలీసింగ్‌పై దృష్టి
సీసీటీఎన్‌ఎస్ (CCTNS), ఈ-సాక్ష్య, ఈ-సమ్మన్స్ విధానాల అమలును ఎస్పీ పరిశీలించారు. ప్రతి కేసుకు సంబంధించిన వివరాలు, దర్యాప్తు పురోగతి, సాక్ష్యాధారాలు, పత్రాలను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. డిజిటల్ ఆధారాల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలీసు సేవలను వేగవంతం చేయాలని సూచించారు.
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, దాని పురోగతిని పర్యవేక్షించాలని చెప్పారు. ఫిర్యాదుదారుల సమస్యలను ఓపికగా విని మర్యాదపూర్వకంగా స్పందించాలని సిబ్బందికి సూచించారు.
సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన
ఆన్‌లైన్ పెట్టుబడులు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, నకిలీ ట్రేడింగ్ యాప్‌లు, డిజిటల్ అరెస్టులు, ఓటీపీలు, ఫేక్ లింకుల పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని ఎస్పీ ఆదేశించారు. గ్రామాలు, విద్యాసంస్థలు, ప్రజా సమూహాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
గంజాయి, గుడుంబా అక్రమ కార్యకలాపాలపై నిఘా
గంజాయి కేసులు, గుడుంబా తయారీ, విక్రయాలపై ఇప్పటివరకు చేపట్టిన చర్యలను ఎస్పీ సమీక్షించారు. గంజాయి నిల్వలు, రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని, సరఫరా వెనుక ఉన్న వ్యక్తులు, మార్గాలను గుర్తించి నెట్‌వర్క్‌ను ఛేదించాలని ఆదేశించారు. సమాచారం అందిన వెంటనే దాడులు నిర్వహించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
గుడుంబా తయారీ కేంద్రాలు, అక్రమ విక్రయాలపై నిరంతరం దాడులు చేపట్టాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో గుడుంబా వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, సామాజిక దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.
మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం
పోక్సో కేసులు, మహిళల అదృశ్యానికి సంబంధించిన కేసుల వివరాలను ఎస్పీ సమీక్షించారు. మహిళలు, చిన్నారుల ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, బాధితులకు తక్షణ సహాయం అందిస్తూ దర్యాప్తును ప్రాధాన్యతతో చేపట్టాలని సూచించారు.
స్టేషన్ పరిధిలో గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాలకు కారణాలను గుర్తించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాల వివరాలను సక్రమంగా నమోదు చేసి, న్యాయస్థాన అనుమతులు, నిబంధనల ప్రకారం వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు.
పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ డాక్టర్ శబరీష్ సూచించారు. విధుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని, సిబ్బంది ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని తెలిపారు.

0 మంది ఇష్టపడ్డారు
షేర్
డౌన్‌లోడ్న్యూస్ పేపర్ క్లిప్పింగ్ • హై క్వాలిటీ

మరిన్ని వార్తలు

వ్యాఖ్యానించండి