విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురువుల సేవలు చిరస్మరణీయం: ఏనుగు సుదర్శన్ రెడ్డి
మేడ్చల్ నియోజకవర్గంలోని ఔషాపూర్ గ్రామ పాఠశాల ప్రాంగణంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఏనుగు సుదర్శన్ రెడ్డి శాలువాలతో సన్మానించారు. అనంతరం వారికి పూల మొక్కలను అందజేసి, ఉపాధ్యాయుల సేవలను అభినందించారు.
ఈ సందర్భంగా ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించడంతో పాటు మంచి విలువలు, క్రమశిక్షణ, సమాజం పట్ల బాధ్యత వంటి అంశాలను నేర్పుతూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని అన్నారు.
తల్లిదండ్రుల తర్వాత విద్యార్థుల జీవితంపై అత్యంత ప్రభావం చూపించే వ్యక్తులు ఉపాధ్యాయులేనని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తును నిర్మించే విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి కీలకమని, వారి సేవలను సమాజం ఎల్లప్పుడూ గౌరవించాలని అన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కోఆర్డినేటర్ సభ్యుడు, PMEGP సెల్ కో-కన్వీనర్ కప్పర గళ్ల కరుణాకర్, సీనియర్ నాయకులు ఏనుగు మచ్చేందర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు ఉదారి కృష్ణ యాదవ్, కొలిచెలిమి సత్యనారాయణ, కాసుల వెంకటేష్ గౌడ్, మహేష్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.