ఎమ్మెల్యే శంకరయ్యపై ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌లో బీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు
ఎల్లారెడ్డి పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకరయ్యపై బీఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై ఎమ్మెల్యే శంకరయ్య అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఈ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
బీఆర్‌ఎస్ శ్రేణుల కథనం ప్రకారం.. కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రుల మాట తీరు హద్దు దాటుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఎమ్మెల్యే శంకరయ్య కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు, ఆయన చావు కోరుకుంటున్నానని బహిరంగంగా ప్రకటించారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు.
ఈ సందర్భంగా ఎల్లారెడ్డి బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీష్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన కేసీఆర్ చావు కోరుకోవడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల కేసీఆర్ ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారని తెలిపారు.
ఎమ్మెల్యే శంకరయ్య వ్యాఖ్యలపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సతీష్ కుమార్ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి సొసైటీ అధ్యక్షుడు ఏగుల నర్సింలు, శ్రవణ్, సాయిలు, బబ్లు, నాగం రాజయ్య, ఇమ్రాన్, బర్కత్, అజయ్, పాండు, పృథ్వీరాజ్, అరవింద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.