నాగారంలో శ్రీనివాస్ నగర్ బస్తీ దవాఖానను సందర్శించిన టీఆర్‌పీ నాయకులు
నాగారం దర్గా సమీపంలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉన్న బస్తీ దవాఖానను తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) నాయకులు గండ్ర కమలాకర్ పటేల్, ప్రవీణ్ కుమార్, రాచమళ్ల లక్ష్మణ్, సాయి కిరణ్ ఈరోజు సందర్శించారు. దవాఖానలో అందుతున్న వైద్య సేవలు, మందులు, వైద్య పరీక్షలను వారు పరిశీలించారు.
ఈ సందర్భంగా డాక్టర్, నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉన్నారని, దవాఖాన పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయని నాయకులు తెలిపారు. వైద్యం కోసం వచ్చిన పలువురు రోగులతో మాట్లాడగా, వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందిస్తున్నారని వారు చెప్పినట్లు నాయకులు పేర్కొన్నారు.
ఇటీవల పత్రికల్లో వచ్చిన వార్తల నేపథ్యంలో బీపీ పరీక్షలకు సంబంధించిన పరికరాలపై డాక్టర్ శ్రీలేఖను నాయకులు ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఆమె.. ప్రభుత్వం అందించిన ఎలక్ట్రానిక్ బీపీ మిషన్ దవాఖానలో అందుబాటులో ఉందని, దాని ద్వారా రోగులకు బీపీ పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించినట్లు నాయకులు తెలిపారు.
దవాఖానలో అవసరమైన పలు రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, రోగులకు అవసరమైన పలు వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు నాయకులు పేర్కొన్నారు. రికార్డులను పరిశీలించగా రోజుకు సుమారు 50 నుంచి 60 మంది వరకు రోగులు వైద్య సేవలు పొందుతున్నట్లు తెలిసిందని తెలిపారు.
ఈ సందర్భంగా టీఆర్‌పీ నాయకులు డాక్టర్ శ్రీలేఖతో పాటు దవాఖాన సిబ్బందిని అభినందించారు. ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ వైద్య సేవలను సమర్థవంతంగా అందిస్తున్న సిబ్బందిని అభినందించడం సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు.
టీఆర్‌పీ నాయకులు నాగారం ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ.. సత్యనారాయణ కాలనీ–దర్గా సమీపంలోని శ్రీనివాస్ నగర్ బస్తీ దవాఖానలో వైద్యులు, సిబ్బంది, మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బీపీ, షుగర్‌తో పాటు అవసరమైన ఇతర వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారని పేర్కొంటూ, ప్రజలు ఈ ప్రభుత్వ వైద్య సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అలాగే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండటం ప్రయోజనకరమని, ప్రభుత్వ వైద్య కేంద్రాలను ప్రజలు వినియోగించుకోవడంతో పాటు వాటి సేవలను మరింత మెరుగుపరచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీఆర్‌పీ నాయకులు కోరారు.