గార్లలో శాతవాహన ఎక్స్‌ప్రెస్ హాల్టింగ్ కోసం ఎంపీకి వినతి

గార్ల రైల్వే స్టేషన్ సమస్యలపై ఖమ్మం ఎంపీకి వినతిపత్రం

పవార్ వార్త, గార్ల: గార్ల రైల్వే స్టేషన్‌లో శాతవాహన ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఇతర ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని, స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేసి ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డికి వినతిపత్రం అందజేశారు. గార్ల మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గంగావతు రాంసింగ్ నాయక్ ఈ అంశంపై ఎంపీని సంప్రదించారు.

రైల్వే స్టేషన్ సమస్యలపై ఎన్నేళ్లుగా వినతులు

గార్ల రైల్వే స్టేషన్‌లో రైళ్ల హాల్టింగ్, కోచ్ డిస్‌ప్లే, ప్లాట్‌ఫారమ్ పొడిగింపు, స్టేషన్ అప్‌గ్రేడేషన్ వంటి సమస్యల పరిష్కారం కోసం మండల ప్రముఖులు, ప్రజాస్వామ్యవాదులు ఎన్నో సంవత్సరాలుగా ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, రైల్వే అధికారులకు వినతులు అందజేస్తున్నారు. సోషల్ మీడియా, పత్రికలు, ఇతర మాధ్యమాల ద్వారా కూడా ఈ సమస్యలను ప్రస్తావిస్తున్నారు.

ఎంపీ పీఏకు వినతిపత్రం అందజేత

పెద్ద కిష్ణాపురం సర్పంచ్ గంగావతు రాంసింగ్ నాయక్ ఈ సమస్యలపై ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డిని ఫోన్ ద్వారా సంప్రదించారు. అక్టోబర్ 4న ఖమ్మం రావాలని ఎంపీ సూచించినట్లు రాంసింగ్ నాయక్ తెలిపారు.

ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయానికి వెళ్లిన సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికలు, తుఫాన్ సమస్యల నేపథ్యంలో ఎంపీ ఇతర అధికారిక కార్యక్రమాలకు వెళ్లినట్లు తెలిసింది. అనంతరం ఎంపీ స్వయంగా ఫోన్ చేసి, తన పీఏ దీపక్‌కు వినతిపత్రం అందజేసి సమస్యలను వివరించాలని రాంసింగ్ నాయక్‌కు సూచించారు.

వారం రోజుల్లో సమయం ఇస్తానని ఎంపీ హామీ

వినతిపత్రం అందజేసిన అనంతరం గార్ల రైల్వే స్టేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, వారం రోజుల్లో సమావేశానికి సమయం ఇస్తానని ఎంపీ రఘురాం రెడ్డి ఫోన్ ద్వారా హామీ ఇచ్చినట్లు రాంసింగ్ నాయక్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు, రైల్వే విశ్రాంత ఉద్యోగులు గుంటి శ్రీను, తొలి తెలంగాణ ఉద్యమకారుడు మధులాకర్ శివాజీ, వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

0 మంది ఇష్టపడ్డారు
షేర్
డౌన్‌లోడ్న్యూస్ పేపర్ క్లిప్పింగ్ • హై క్వాలిటీ

మరిన్ని వార్తలు

వ్యాఖ్యానించండి