నామినేషన్ల వరకు ఓటరు నమోదుకు అవకాశం ఇవ్వాలి
ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు పెంచాలని సీఈవోకు కవిత విజ్ఞప్తి
ఇవి కూడా చదవండి
పవార్ వార్త, తెలంగాణ: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు గడువును నామినేషన్లు వేసే వరకు పొడిగించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎన్నికల అధికారులను కోరారు. బీఆర్కేఆర్ భవన్లో రాష్ట్ర ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డితో సమావేశమై ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
ఓటరు నమోదు గడువు పెంచాలని విజ్ఞప్తి
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 6 వరకు ఉందని చెబుతున్నారని కవిత పేర్కొన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ ఈ నెల 21 వరకు కొనసాగుతున్న నేపథ్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును కూడా పొడిగించాలని కోరినట్లు తెలిపారు.
నామినేషన్లు పూర్తయ్యే వరకు ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగించాలని విజ్ఞప్తి చేశామని, దీనిపై సీఈవో సానుకూలంగా స్పందించారని కవిత వెల్లడించారు.
గ్రాడ్యుయేట్లు నమోదు చేసుకోవాలి
తెలంగాణలోని పాత ఆరు ఉమ్మడి జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయని కవిత తెలిపారు. ఈ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు ప్రభుత్వ పనితీరు, ప్రతిపక్షాల వైఖరిని పరిశీలించి ఓటు వేస్తారని పేర్కొన్నారు. జెన్‌జీతో పాటు గ్రాడ్యుయేట్లు ఎన్నికలను సీరియస్‌గా తీసుకుని ఓటరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
పార్టీ రిజిస్ట్రేషన్ అంశాన్ని కూడా ప్రస్తావన
తెలంగాణ రక్షణ సేన పార్టీ రిజిస్ట్రేషన్ ఢిల్లీలో పెండింగ్‌లో ఉందని కవిత తెలిపారు. రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలు, కమిటీల ఏర్పాటు, ప్రజల్లో చేస్తున్న ప్రయత్నాలను సీఈవో పరిగణనలోకి తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. పార్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి రాష్ట్ర సీఈవో తరఫున నివేదిక ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ప్రతిసారీ రీ-రిజిస్ట్రేషన్ చేయాల్సి రావడం అభ్యర్థులకు ఖర్చుతో కూడుకున్నదని కవిత పేర్కొన్నారు. పెద్ద విద్యాసంస్థల విద్యార్థుల ద్వారా ఎన్నికలు ప్రభావితమవుతున్నాయని ఆమె ఆరోపించారు. ఈ అంశాన్ని ఎన్నికల అనంతరం ఈసీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
















