నిజామాబాద్ రూరల్‌లో పోలీస్ స్టేషన్ల పరిధుల మార్పునకు ఎమ్మెల్యే ప్రతిపాదనలు
డీజీపీ సీవీ ఆనంద్‌తో భూపతి రెడ్డి భేటీ.. పోలీస్ శాఖకు మౌలిక వసతులు కల్పించాలని వినతి
ఇవి కూడా చదవండి
పవార్ వార్త, డిచ్పల్లి: ఇందల్వాయి పోలీస్ స్టేషన్‌కు సొంత భవనం నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని, డిచ్పల్లిలోని 7వ పోలీస్ బెటాలియన్‌లో శిథిలావస్థకు చేరిన భవనాల స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి డీజీపీ సీవీ ఆనంద్‌ను కోరారు. పోలీస్ స్టేషన్ల పరిధుల పునర్వ్యవస్థీకరణతో పాటు పోలీస్ శాఖకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రతిపాదనలు సమర్పించారు.
శనివారం నిజామాబాద్ పర్యటనకు వచ్చిన డీజీపీ సీవీ ఆనంద్‌ను ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఓ ప్రైవేట్ హోటల్లో కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్ల పరిధులు, భవనాల నిర్మాణం, బెటాలియన్‌లో సిబ్బందికి వసతుల కల్పనపై చర్చించారు.
పోలీస్ స్టేషన్ల పరిధుల మార్పునకు ప్రతిపాదనలు
ప్రజలకు పోలీస్ సేవలు మరింత అందుబాటులో ఉండేలా నిజామాబాద్ రూరల్, మోపాల్ పోలీస్ స్టేషన్ల పరిధులను పునర్వ్యవస్థీకరించాలని ఎమ్మెల్యే కోరారు. ప్రస్తుతం నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జలాల్పూర్, మల్కాపూర్ (ఏ), పాల్దా గ్రామాలతో పాటు నిజామాబాద్ VI టౌన్ పరిధిలోని శాస్త్రీనగర్, సారంగాపూర్ ప్రాంతాలను నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదించారు.
అదేవిధంగా నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పాంగ్రా, మాధవ్‌నగర్ గ్రామాలతో పాటు నిజామాబాద్ IV టౌన్ పరిధిలోని బోర్గాం (పి) గ్రామాన్ని మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి మార్చాలని కోరారు. ఈ మార్పులతో ఆయా ప్రాంతాల ప్రజలకు పోలీస్ సేవలు చేరువవుతాయని, శాంతిభద్రతల పర్యవేక్షణ సులభతరమవుతుందని వివరించారు.
ఇందల్వాయి పోలీస్ స్టేషన్‌కు సొంత భవనం
ఇందల్వాయి పోలీస్ స్టేషన్ ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతోందని ఎమ్మెల్యే డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. పోలీస్ సిబ్బందికి అవసరమైన వసతులు కల్పించడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సొంత భవనం అవసరమని పేర్కొన్నారు. నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
7వ బెటాలియన్‌లో 300 మెన్ క్వార్టర్స్ ప్రతిపాదన
డిచ్పల్లిలోని 7వ పోలీస్ బెటాలియన్ 1975లో ఏర్పాటైనప్పటి నుంచి నిర్మించిన పలు భవనాలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. పరిపాలనా భవనం, సిబ్బంది నివాస భవనాలు పాతబడటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు.
బెటాలియన్‌లో నూతన పరిపాలనా భవనం, 2 అసిస్టెంట్ కమాండెంట్ క్వార్టర్స్, 4 ఆర్ఐ క్వార్టర్స్, 10 ఆర్ఎస్ఐ క్వార్టర్స్, 300 మెన్ క్వార్టర్స్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. అలాగే బెటాలియన్ ప్రాంగణంలో 1,300 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించారు.
ఈ నిర్మాణాలు పూర్తయితే పోలీస్ సిబ్బందికి నివాస, పరిపాలనా సదుపాయాలు మెరుగుపడతాయని భూపతి రెడ్డి వివరించారు. పోలీస్ స్టేషన్ల పరిధుల మార్పు, ఇందల్వాయి పోలీస్ స్టేషన్ భవనం, 7వ బెటాలియన్ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను సత్వరమే పరిశీలించాలని డీజీపీని కోరారు. తన విజ్ఞప్తులపై డీజీపీ సీవీ ఆనంద్ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారు.














