జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌పై అఖిలపక్ష పోరాటం చేయాలి
అంబేద్కర్ స్ఫూర్తితో డంపింగ్ యార్డ్‌పై ఉద్యమించాలి
ఇవి కూడా చదవండి
పవార్ వార్త, జవహర్‌నగర్: డంపింగ్ యార్డ్ శాశ్వత మూసివేత కోసం రాజకీయ పార్టీలు తమ విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా ఉద్యమించాలని జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్ షావలి పిలుపునిచ్చారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం అవసరమైతే రాజకీయ పదవులను సైతం పణంగా పెట్టి పోరాడాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్‌లకు విజ్ఞప్తి చేశారు.
నవంబర్ 1న కీసర సర్కిల్ పరిధిలోని జవహర్‌నగర్ జీహెచ్ఎంసీ బాలాజీనగర్ బస్టాండ్ సెంటర్లో భారత రాజ్యాంగ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 123వ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించారు. కమిటీ నిర్వాహకుడు మహంకాళి బిక్షు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైన షేక్ షావలి డంపింగ్ యార్డ్ సమస్యపై మాట్లాడారు.
అంబేద్కర్ రాజీనామా స్ఫూర్తితో పోరాటం చేయాలి
1951లో హిందూ కోడ్ బిల్లు ఆమోదం పొందకపోవడంతో అప్పటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తన పదవికి రాజీనామా చేసిన విషయాన్ని షేక్ షావలి ప్రస్తావించారు. మహిళల హక్కుల కోసం అంబేద్కర్ చేసిన పోరాట స్ఫూర్తితో డంపింగ్ యార్డ్ బాధిత ప్రాంతాల ప్రజల కోసం ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని కోరారు.
ఈటల రాజేందర్, మల్లారెడ్డి, వజ్రేష్ యాదవ్‌లు రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ఒకే వేదికపైకి రావాలని సూచించారు. ముగ్గురు నాయకులు కలిసికట్టుగా ఉద్యమిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రజల ఆరోగ్యం, జీవన ప్రమాణాల విషయంలో రాజకీయ పదవులకు ప్రాధాన్యం ఇవ్వకూడదని అన్నారు.
ఆర్టికల్ 21 ప్రకారం స్వచ్ఛమైన గాలి హక్కు
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 జీవించే హక్కును కల్పించిందని షేక్ షావలి పేర్కొన్నారు. స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన పర్యావరణంలో జీవించే హక్కును ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.
జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌ను శాశ్వతంగా మూసివేయడంతోపాటు శాస్త్రీయ పద్ధతిలో క్యాపింగ్, బయోమైనింగ్ ప్రక్రియలను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. డీపీఆర్, రూ.3,000 కోట్ల నిధుల అంశం చుట్టూ సాగుతున్న రాజకీయ చర్చల్లో బాధిత ప్రాంత ప్రజలు ఇబ్బందులకు గురికాకూడదని వ్యాఖ్యానించారు.
దమ్మాయిగూడ, జవహర్‌నగర్ జేఏసీలతోపాటు నాలుగు మండలాలకు చెందిన సుమారు 30 లక్షల మంది ప్రజలు డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారని షేక్ షావలి పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు విడివిడిగా ప్రకటనలు చేయడం కంటే ఉమ్మడి కార్యాచరణతో ముందుకు రావాలని కోరారు.
పాట, మాటతో డంపింగ్ యార్డ్ సమస్యపై అవగాహన
కార్యక్రమంలో ప్రజానాట్య మండలి కళాకారుడు వెంకటాచారి, తెలంగాణ ఉద్యమ కళాకారుడు గజ్జెల రాంచందర్ డంపింగ్ యార్డ్ సమస్యతోపాటు మహనీయులపై పాటలు, మాటల ప్రదర్శన ఇచ్చారు.
టీజేఎస్‌కు చెందిన బద్రగామి అంజనేయులు, సీపీఎం శివన్నారాయణ, పీఓడబ్ల్యూ జయసుధ, జవహర్‌నగర్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్‌కు చెందిన మహ్మద్ పాషామియా, పీఓడబ్ల్యూ (విముక్తి) నాయకులు గడిపే సునీత, తుమ్మరాణి, ఏఐటీయూసీ అంబాల ఎల్లయ్య, తెలంగాణ ఉద్యమ మహిళా విభాగం సన్వాల సుచరిత, డీవైఎఫ్ఐకి చెందిన కె.బాలు, గడ్డంగిరి, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
















