రైతులకు కోతలు లేని విద్యుత్ అందించాలి.. బీజేపీ కిసాన్ మోర్చా ధర్నా

ఎల్‌నినో ప్రభావంపై ముందే తెలిసినా చర్యలు తీసుకోలేదని ప్రభుత్వంపై విమర్శలు.. విద్యుత్ ఎస్‌ఈకి వినతిపత్రం

విద్యుత్ కోతలకు ప్రభుత్వ ముందుచూపు లేమే కారణం: ఎమ్మెల్యే కాటిపల్లి

కామారెడ్డి: రైతులకు కోతలు లేని నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కామారెడ్డిలోని విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతుల విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యుత్ ఎస్‌ఈ సాల్య నాయక్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా కామారెడ్డి ఎమ్మెల్యే, బీజేఎల్పీ ఉపనేత కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్లే రైతులు విద్యుత్ కోతలను ఎదుర్కోవాల్సి వస్తోందని విమర్శించారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరు నెలల ముందే తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

గత ప్రభుత్వంపై విమర్శలు చేయడంపై చూపుతున్న శ్రద్ధను రైతుల సమస్యల పరిష్కారంపై కూడా పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై రాజకీయ విమర్శలు చేయడం కంటే రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించడంపై దృష్టి సారించాలని అన్నారు.

ప్రస్తుత పంటకు అవసరమైన నీటిని తప్పనిసరిగా అందించాలని, రానున్న యాసంగి పంటకు సంబంధించి ఇప్పటి నుంచే సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. సాగునీటి అవసరాలను ముందుగానే అంచనా వేసి తగిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

రైతులకు నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా, సాగునీటి లభ్యత, రానున్న పంటల ప్రణాళికపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.

0 మంది ఇష్టపడ్డారు
షేర్
డౌన్‌లోడ్న్యూస్ పేపర్ క్లిప్పింగ్ • హై క్వాలిటీ

మరిన్ని వార్తలు

వ్యాఖ్యానించండి