పోచారం రిజర్వాయర్‌పై ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే మదన్ మోహన్
రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని పునరుత్పాదక ఇంధన వనరులను మరింతగా వినియోగించుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలోని రామగుండం వద్ద కొనసాగుతున్న ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ తరహాలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పోచారం రిజర్వాయర్‌పై ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
పోచారం రిజర్వాయర్‌లో విస్తారమైన నీటి విస్తీర్ణం అందుబాటులో ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భూసేకరణ అవసరం లేకుండానే నీటిపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉందని తెలిపారు. సుమారు 14.14 చదరపు కిలోమీటర్ల వాటర్ స్ప్రెడ్ ఏరియా, 2 TMCల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న పోచారం రిజర్వాయర్‌లో పరిమిత స్థలాన్ని వినియోగించుకుని సౌర విద్యుత్ ఉత్పత్తి చేపట్టవచ్చని పేర్కొన్నారు.
ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ ద్వారా ఒకవైపు విద్యుత్ ఉత్పత్తి పెరగడంతో పాటు మరోవైపు నీటి ఆవిరీభవనాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని మదన్ మోహన్ వివరించారు. రిజర్వాయర్‌పై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయడం వల్ల నీటి ఆవిరీభవనం 30 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తెలంగాణలోని రామగుండం NTPCలో 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ కొనసాగుతున్న విషయాన్ని ఎమ్మెల్యే ప్రస్తావించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా నీటి సంరక్షణతో పాటు బొగ్గు వినియోగం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో ప్రయోజనం కలుగుతోందని తెలిపారు.
40–50 మెగావాట్ల ప్లాంట్‌పై సాధ్యాసాధ్యాల అధ్యయనం కోరిన ఎమ్మెల్యే
పోచారం రిజర్వాయర్‌పై 40–50 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ కోరారు. ఇందుకోసం TGREDCO, TGGENCOలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి తక్షణమే Feasibility Study, DPR తయారు చేయించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే నిజాంసాగర్, శ్రీరాంసాగర్ వంటి రాష్ట్రంలోని ఇతర రిజర్వాయర్లలోనూ ఇలాంటి ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
పోచారం రిజర్వాయర్‌లో ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తే విద్యుత్ ఉత్పత్తి పెంపుతో పాటు నీటి ఆవిరీభవనాన్ని అరికట్టే ద్వంద్వ ప్రయోజనం కలుగుతుందని ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు.
ఈ వార్తను షేర్ చేయండి
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.