పది రోజులకోసారి తాగునీరా? శాంతినగర్‌లో ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన
జవహర్ నగర్‌లోని శాంతినగర్‌లో తాగునీటి సరఫరా సమస్యపై మహిళలు ఆందోళనకు దిగారు. పది రోజులకు ఒకసారి మాత్రమే మంచినీరు సరఫరా అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ, శాంతినగర్, నందమూరి నగర్, గిరిప్రసాద్ నగర్ ప్రాంతాలకు చెందిన మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.
తాగునీటి సమస్యపై మహిళలు మీడియా ముందు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. కనీసం రెండు రోజులకు ఒకసారైనా మంచినీటిని సరఫరా చేయాలని, అధికారులు తక్షణమే స్పందించి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేశారు.
నిత్యావసరాలకు అవసరమైన నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు తెలిపారు. తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని మీడియా ద్వారా కోరారు.
ఈ ఆందోళన కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చిత్ర సుబ్రహ్మణ్యం, నాయకులు చికెన్ యాదగిరి, కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొని మహిళల నిరసనకు మద్దతు తెలిపారు. శాంతినగర్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు క్రమం తప్పకుండా మంచినీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.