పవార్ వార్త, పెబ్బేరు: వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం తోమాలపల్లె గ్రామ సమీపంలోని హైవేపై అర్ధరాత్రి భారీ మొసలి కనిపించింది. నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి సమీపంలో మొసలిని చూసిన వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు సుమారు 2 గంటల పాటు శ్రమించి మొసలిని పట్టుకున్నారు.
అర్ధరాత్రి హైవేపై కలకలం
అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత మొసలి కనిపించిన విషయాన్ని స్థానిక ఎస్సై వెంకటేశ్వర్ గౌడ్‌కు తెలియజేశారు. ఆయన వెంటనే స్పందించి అటవీశాఖ సిబ్బందిని అప్రమత్తం చేశారు. అటవీశాఖ అధికారులు వెంకటయ్య, శ్రీను, నాగశేష్, వాచర్ వెంకటయ్యతో పాటు గ్రామ సర్పంచ్ అశోక్, ఇతర సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
ఇవి కూడా చదవండి
నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి సమీపంలో భారీ మొసలి కనిపించడంతో అటువైపు ప్రయాణిస్తున్న వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. మొసలిని పట్టుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
రెండు గంటల పాటు శ్రమించి పట్టివేత
భారీ ఆకారంలో ఉన్న మొసలిని అదుపులోకి తీసుకునేందుకు సిబ్బంది సుమారు 2 గంటల పాటు శ్రమించారు. పట్టుకునే ప్రయత్నంలో మొసలి నోరు తెరిచి వెంబడించేందుకు ప్రయత్నించడంతో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు. తాళ్లతో బంధించేందుకు తొలుత చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో మరోసారి ప్రయత్నించాల్సి వచ్చింది.
చివరకు అధికారులు చాకచక్యంగా మొసలిని తాళ్లతో బంధించారు. గ్రామ సర్పంచ్ అశోక్ సహకారంతో దానిని సురక్షితంగా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
రంగాపూర్ సమీపంలో కృష్ణానదిలో విడుదల
మొసలిని పట్టుకున్న అనంతరం రంగాపూర్ సమీపంలోని కృష్ణానదిలో విడిచిపెట్టినట్లు ఎస్సై వెంకటేశ్వర్ గౌడ్ తెలిపారు. అర్ధరాత్రి హైవేపై కనిపించిన మొసలిని సురక్షితంగా తరలించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ చర్యలో పాల్గొన్న ఎస్సై వెంకటేశ్వర్ గౌడ్, అటవీశాఖ సిబ్బందిని తోమాలపల్లె గ్రామ ప్రజలు అభినందించారు.














