జుక్కల్ సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. డ్రైవర్ మృతి
బిచ్కుంద సమీపంలో డివైడర్‌ను ఢీకొని బోల్తా పడిన బస్సు
జుక్కల్ ఎక్స్ రోడ్ దాటి బిచ్కుంద సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో బస్సు డ్రైవర్ అంజనేయులు మృతి చెందడం తనను తీవ్రంగా కలిచివేసిందని మంత్రి పేర్కొన్నారు.
హైదరాబాద్-1 డిపోకు చెందిన TS34Z0030 నంబర్ గల ఎక్స్‌ప్రెస్ బస్సు BCK3 సర్వీస్ ద్వారా హైదరాబాద్ నుంచి బిచ్కుందకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో బిచ్కుంద సమీపంలో రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ను బస్సు ఢీకొని బోల్తా పడింది.
ప్రమాదంపై అధికారులతో మంత్రి ఆరా
ప్రమాద ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఎండీ, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు, ప్రస్తుతం పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
బస్సు కింద చిక్కుకుని డ్రైవర్ అంజనేయులు మృతి చెందడంపై మంత్రి విచారం వ్యక్తం చేస్తూ, మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
13 మంది ప్రయాణికులు.. కొందరికి స్వల్ప గాయాలు
బస్సులో మొత్తం 13 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడినప్పటికీ కొంతమందికి స్వల్ప గాయాలైనట్లు తెలిపారు. గాయపడిన వారిని అంబులెన్స్‌ల ద్వారా సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం, మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. అవసరమైన అన్ని వైద్య సహాయ చర్యలను తక్షణమే చేపట్టాలని సూచించారు.
అలాగే ఆర్‌ఎం నేతృత్వంలో అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. బాధితులకు అవసరమైన అన్ని విధాలుగా అండగా నిలవాలని సూచించారు.
ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పూర్తి వివరాలను తెలుసుకుని, బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పేర్కొన్నారు.